iDreamPost
android-app
ios-app

ఇది కదా వాలంటీర్ వ్యవస్థ పవర్

ఇది కదా వాలంటీర్ వ్యవస్థ పవర్

ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ శక్తి ఏమిటో దేశానికి తెలుస్తోంది. బియ్యం మూటలు మోసే వాళ్ళు అంటూ హేళనలు, పిల్లను కూడా ఇవ్వరంటూ ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు , టీడీపీ నేతలకు వాలంటీర్ల సత్తా ఏమిటో తెలుస్తోంది. అందుకే తేలుకుట్టిన దొంగల్లా ఉంటున్నారు. తరచూ మీడియా, సోషల్ మీడియాలో కరోనా పై మాట్లాడుతున్న టీడీపీ నేతలు వాలంటీర్ల సేవల పై మాత్రం గతంలో లాగా అవాకులు చవాకులు పేలడంలేదు.

తాజాగా వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏమిటో అందరికీ తెలిసింది. లాక్ డౌన్ సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ రోజున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరుసటి రోజు నుంచే లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. తమ రాష్ట్రంలో ని దాదాపు 90 లక్షల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ కూడా.. తమ రాష్ట్రంలో ఉన్న 1.30 కోట్ల రేషన్ కార్డుదారులకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. మరో రెండు రోజులకే ఆ మొత్తం ఏప్రిల్ 4వ తేదీన ఇస్తామని ప్రకటించారు.

ఏపీ లో పేదలకు 1000 రూపాయల ఇచ్చే కార్యక్రమం సీఎం జగన్ చెప్పినట్లు ఈ నెల 4వ తేదీన ఇవ్వగా.. తెలంగాణ రాష్ట్రం ఆ మొత్తం ఎలా పంపిణీ చేయాలో అర్థం గాక ఇప్పటికీ తికమకపడుతోంది. ఎలా ఇవ్వాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పడం గమనార్హం. ఏపీ లో ఒకే రోజు వాలంటీర్ల ద్వారా ఆ మొత్తాన్ని అందించడం విశేషం.

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, అప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందించడంతోనే వాలంటీర్ల సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. కరోనా పై పోరాటంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని సీఎం జగన్ కూడా ప్రశంసలు కురిపించారు. జాతీయ మీడియా సైతం వాలంటీర్ల సేవల పై కధనాలు ప్రచురించింది. ఇప్పటికీ తమ పరిధిలోని ఇళ్ల పై నిఘా వేసి.. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే పై అధికారులకు వాలంటీర్లు సమాచారం ఇస్తూ.. కరోనా పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తాజా నగదు పంపిణీ మరో మారు వాలంటీర్ వ్యవస్థ బలం ఏమిటో తెలియజేసింది.