Idream media
Idream media
విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు ఒకరు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన తన నియోజకవర్గంలో ఉండడం లేదు. ఒకటి రెండు సార్లు పార్టీ కార్యాలయంలో కనిపించినప్పటికీ పూర్తిస్థాయిలో అమరావతికే పరిమితమయ్యారు.
ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడానికి కారణమేంటా అని ఆరా తీయగా.. సొంత పార్టీ కార్యకర్తలే అని తెలిసిందే. వైజాగ్‌లోని మిగతా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వాసుపల్లి గణేశ్ కుమార్‌లు విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. అయితే ఒక్క రామకృష్ణబాబు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. అసెంబ్లీలోనూ ఆక్షేపణీయంగా మాట్లాడారు. దీంతో నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు లేని అభ్యంతరం నీకెందుకు అంటూ ముఖాన్నే అడిగాశారంట. చంద్రబాబు సైతం వారిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నప్పుడు నువ్వు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడడంలో ఆంతర్యమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గంలో ప్రజలకు ఎలా ముఖం చూపించాలని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ఓట్లు అడగాలంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు. విశాఖను పరిపాలన రాజధానిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటన చేయకపోతే పార్టీ కార్యాలయం, ఇంటి వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన వైఖరికి నిరసనగా ఆయన దిష్టి బొమ్మలను దహనం చేశాయి. విశాఖ సొమ్ము తిని, ఎక్కడి నుంచో వచ్చి విశాఖలో ఆవాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడతారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విశాఖలోనే ఉంటే రోజూ తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే ఆందోళన చేస్తుంటారని భావించిన ఆయన పూర్తిస్థాయిలో అమరావతికే పరిమితయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. చంద్రబాబు వైఖరికి నిరసనగా వైజగ్ సిటీ అధ్యక్షడు రెహ్మాన్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో వాసుపల్లి గణేష్‌ను నియమించారు. ఆ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టడం గమనార్హం. దీంతో వెలగపూడి కనిపించడం లేదంటూ నగరంలో అక్కడక్కడా పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.