వారు ఫిక్స్‌ అయ్యారు.. వెనక్కి తగ్గుతారా..?

రాజధాని అంశంపై తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకపోయినా విశాఖపట్నం నగరాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు, పార్టీలు, నేతలు ఫిక్స్‌ అయ్యారా..? అంటే తాజా పరిస్థితులను గమనిస్తే అవుననే సమాధానం కనిపిస్తోంది. ఈ రోజు శనివారం విశాఖ నగరం పర్యటనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెళుతున్నారు. మూడు రాజధానులు అనే అంశం ప్రాచూర్యంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారి విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

కార్యనిర్వాహక రాజధాని విశాఖ…

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని గా చేయాలని నివేదికలో పేర్కొంది. అంతకుముందే అసెంబ్లీలో సీఎం జగన్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నిన్న శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని భావించినా చివరి నిమిషంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయడంతో మూడు రాజధానుల వ్యవహారం కొద్ది రోజుల పాటు వాయిదా పడినట్లైంది.

ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు…

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను సీఎం జగన్, జీఎన్‌ రావు కమిటీ ప్రతిపాదించడంతో ఉభయగోదావరి జిల్లాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు అన్ని పార్టీల నేతల ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో టీడీపీ గ్రేటర్‌ విశాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర నేతలు ఏ స్థాయిలో సమర్థిస్తున్నారో వెల్లడవుతోంది.

వలసల ఆగడంపై ఉత్తరాంధ్ర ఆశలు..

ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అపారమైన సహజ వనరులు ఉన్నా కూడా వెనుకబడింది. ఆ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం రాష్ట్రంతోపాటు సమీప రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. రోడ్డు పనులు, ఇటుక బట్టీలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి కోతలు.. ఇలా సీజనల్‌గా ఏ పని దొరికినా పొట్ట చేతపట్టుకుని కుటుంబమంతా వెళుతుంది. ఫలితంగా వారికి ఉపాధి దొరికినా వారి పిల్లల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతోంది. నిత్యం వలస వెళుతూ పలు ప్రాంతాలు తిరుగుతుండడంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్యకు జగన్‌ సర్కార్‌ ప్రతిపాదన పరిష్కారంగా భావిస్తున్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరాన్ని ఏర్పాటు చేస్తే తమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు.

రాతమారడం మాత్రం ఖాయం..

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ వస్తే ఇక రాబోయే పరిశ్రమలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నగరం ఇప్పటì కే అభివృద్ధి చెందింది. నగరం చుట్టు పక్కలా పరిశ్రమలు ఉన్నాయి. భూముల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. భూములు తక్కువ ధరలో కావాలంటే విశాఖ పక్కనే ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలే ప్రత్యామ్న్యాయం. విశాఖ నుంచి విజయనగరం పట్టణం కేవలం 59 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక శ్రీకాకుళం కూడా 121 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పరిశ్రమలు స్థాపించేందుకు ఈ రెండు పట్టణాలు అనుకూలంగా ఉన్నాయి.

అందుకే సీఎంకు ఘన స్వాగతం…

ఫలితంగా ఉత్తరాంధ్రలో భూముల ధరలు పెరగడం, పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు రావడం, మౌలిక సదుపాయాలు యథాతథంగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉండడంతో తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశతో ఉన్నారు. అందుకే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ రోజు విశాఖకు వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ విశాఖకు వస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కైలాసగిరి వెళతారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆపై ఆర్‌కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు. ఎయిర్‌ పోర్టు నుంచి బీచ్‌ వరకు సీఎం వెళుతున్న దారిపోడవునా దాదాపు 24 కిలోమీటర్లు ఘన స్వాగతం పలికేందుకు తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర నేతలు, ప్రజలు సిద్ధమవుతున్నారు. 24 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి ‘థ్యాంక్యూ సీఎం’ ప్లకార్డులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేయనున్నారు.

మూడు రాజధానులపై వెనక్కి..?

విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. నిర్ణయం ఆలస్యమైనా ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోదని నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై వెనక్కి తగ్గుతుందా..? అన్నది సందేహమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Show comments