iDreamPost
iDreamPost
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణం అనేది ఎంత కత్తి మీద సాములా మారిందో అందరికి తెలిసిందే. బిజినెస్ కోసమో లేదా ప్యాషన్ మీదనో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు అధిక శాతం సందర్భాల్లో నష్టాలే మిగులుతున్నాయి. కథల ఎంపికలో జరిగే పొరపాట్లు కావొచ్చు లేదా దర్శకులు చేసిన తప్పులు వల్లో కావొచ్చు మొత్తానికి ఈ పరిశ్రమలో చేతులు కాల్చుకుంటున్న వాళ్ళే ఎక్కువ. సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకునే మార్గాల వైపే ప్రొడ్యూసర్లు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో మొదలైన డిటెక్టివ్ 2 కొంత భాగం షూటింగ్ అయ్యాక ఆయన వైదొలగి హీరోనే దర్శకుడైన వైనం తెలిసిందే.
అసలు కారణాలు బయట చెప్పనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం నివురు గప్పిన నిప్పులా కోలీవుడ్ ని కుదిపేసింది. జరిగిన వాటి గురించి ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మీడియా కథనాలు ఊపందుకున్నాయి. దీనికి చెక్ పెట్టే ఉద్దేశంతో విశాల్ నిన్న డిటెక్టివ్ 2 తమిళ్ వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సుదీర్ఘ వివరణతో కూడిన లేఖను విడుదల చేశాడు. అందులో మిస్కిన్ పెట్టిన డిమాండ్లు, కేవలం స్టొరీ డిస్కషన్ కోసమే 35 లక్షలు ఖర్చు పెట్టిన వైనాన్ని అందులో ప్రస్తావించాడు. ఇప్పటిదాకా 13 కోట్లు ఖర్చు పెట్టించి డిసెంబర్ లో షూట్ ఆపేసి ఫిబ్రవరిలో తాను తప్పుకుంటున్నానని చెప్పడం ఎంత వరకు న్యాయమని అందులో పేర్కొన్నాడు. పైగా పారితోషికం 5 కోట్లతో పాటు డిటెక్టివ్ సినిమాకు సంబంధించిన హిందీ రీమేక్ హక్కులు తనకే ఇవ్వాలని అందులో పేర్కొనడం వివరించాడు.
మిస్కిన్ ఆఫీస్ రెంట్ గా నెలకు 66 వేలతో పాటు మరో 5 వేలు నిర్వహణ ఖర్చుల కోసం ఇవ్వాలట. అనుకున్న టైం షూట్ పూర్తి కాకపోతే వేరే సినిమా పూర్తి చేసుకుని దర్శకుడు ఫ్రీ అయ్యే దాకా నిర్మాత ప్రశ్నించకూడదట. అంతే కాదు రోజుకు ఒక సీన్ బదులు రెండు మూడు సీన్లు, అవసరమైతే నైట్ షూట్ ప్లాన్ చేయమనే హక్కు కూడా నిర్మాతకు లేదట. ఇలాంటి చిత్ర విచిత్ర నిబంధనలతో ప్రొడ్యూసర్ ను బెదిరించడమే లక్ష్యంగా మిస్కిన్ కండిషన్లు పెట్టడంతో ఒళ్ళు మండిన విశాల్ తనే దర్శకుడిగా మారే నిర్ణయం తీసుకున్నాడు. మొత్తానికి ఇతర నిర్మాతలకు మేలుకొలుపు లాగా విడుదల చేసిన ఈ లేఖలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. హీరోల కంటే ఎక్కువగా ఫీలయ్యే కొందరు దర్శకులకు విశాల్ చర్య చెంపపెట్టు లాంటిదని చెప్పొచ్చు. దీని గురించి ఇంకా మిస్కిన్ క్యాంప్ నుంచి ఎలాంటి స్పందన లేదు.