iDreamPost
android-app
ios-app

ప్రియాంక గాంధీపై బిజెపి సీనియ‌ర్ నేత కేశవ ప్రసాద్ మౌర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రియాంక గాంధీపై బిజెపి సీనియ‌ర్ నేత కేశవ ప్రసాద్ మౌర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీపై బిజెపి సీనియ‌ర్ నేత‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి కేశ‌వ ప్ర‌సాద్ మౌర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లి కాలంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్రియాంక గాంధీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. యుపి కేంద్రంగా ఆమె రాజ‌కీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించేందుకు కాంగ్రెస్ త‌ర‌పున వెయ్యి బ‌స్సుల‌ను స‌మ‌కూర్చిన ప్రియాంక గాంధీ, అనేక అంశాల‌పై వెనువెంట‌నే స్పందిస్తున్నారు. వివిధ సంద‌ర్భాల్లో ప్రియాంక గాంధీ కార్యక్ర‌మాల‌ను కూడా యుపి ప్ర‌భుత్వం అడ్డుకుంటుంది. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అంత ప్రముఖమైన జాతీయ నేత కాదని, సోషల్ మీడియానే ఆమెను అలా చిత్రీకరించిందని యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఆరోపించారు.

అమేథీ నుంచి తన సోదరుడు రాహుల్‌నే గెలిపించకలేకపోయిందని ఎద్దేవా చేశారు. యుపి రాజకీయాలపై ప్రియాంక ప్రభావం ఉంటుందా? అని ప్రశ్నించగా ఆయ‌న ఇలా స్పందించారు. ‘‘మేము ఆమెను అంత సీరియస్‌గా తీసుకోం. ఇప్పటికే ఆమెకు ‘ప్రియాంక ట్విట్టర్ వాద్రా’ అని నామకరణం చేసేశాం. 2-3 రోజుకు ఓసారి ట్వీట్ చేస్తుంది. బిజీగా ఉంటుంది. సోషల్ మీడియా ఆమెను ప్రముఖ జాతీయ నాయకురాలిగా చూపిస్తుంది’’ అని విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార నిమిత్తమై ఆమె యుపికి వచ్చిందని, సోదరుడు రాహల్‌ను ప్రధాన మంత్రి చేస్తారని అందరూ భావించారని, కానీ కనీసం ఆయనకు విజయాన్ని కూడా అందిచలేకపోయారని విమర్శించారు.

యుపిలో కాంగ్రెస్ పునాదులను కోల్పోయిందని, నేతలెవ్వరూ లేరని, కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే నేతలే ఉన్నారని అన్నారు. బిజెపి పాలిత ప్రాంతాలను ప్రజల దృష్టిలో నెగెటివ్‌గా చూపించడానికే ప్రియాంక తరుచూ యోగి ఆదిత్యనాథ్ పరిపాలనపై విమర్శలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

వలస కార్మికుల విషయంలో తరచూ యోగి ప్రభుత్వంపై ప్రియాంక విమర్శలకు దిగడంపై కూడా ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఎప్పుడూ యుపివైపే చూస్తుందని, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వైపు చూడదని వారికి ‘దృష్టి దోషం’ ఉందని, వెంటనై సరైన పరీక్షలు చేయించుకోవాలని కేశవ ప్రసాద్ మౌర్య సలహా ఇచ్చారు.