iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ పొడిగింపుపై ముఖ్య‌మంత్రుల‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత‌నాలు

లాక్ డౌన్ పొడిగింపుపై ముఖ్య‌మంత్రుల‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత‌నాలు

కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల‌కు ఫోన్ చేసి మాట్లాడారు.

కోవిడ్‌-19 లాక్‌డౌన్ 4.0 ఆదివారం ముగియ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాక్‌డౌన్ పొడిగించే మార్గం, కొనసాగించాల్సిన ఆంక్షలు, మరింత సడలింపులపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

లాక్ డౌన్‌ 4.0 ముగిసిన తర్వాత జారీ చేయబోయే తదుపరి మార్గదర్శకాలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) కృషి చేస్తున్నది. ఈ నేప‌థ్యంలో అన్ని ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అమిత్ షా విన్నారని అధికారులు తెలిపారు. లాక్ డౌన్‌ మరింత స‌డ‌లింపులు ఉండే పద్ధతిలో ఉండవచ్చని అధికారికి వ‌ర్గాలు తెలిపాయి. అయితే ఆంక్షలు మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నపుడు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్ డౌన్ నిబంధ‌న‌లు కఠినంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది.

మే 18న ప్రారంభమైన లాక్‌డౌన్ 4.0 సందర్భంగా కేంద్రం గణనీయమైన సడలింపులను ఇచ్చింది. లాక్‌డౌన్ చర్యల అమలు విషయానికి వస్తే మే 31 తరువాత రాష్ట్రాలు మ‌రిన్ని సడలింపులను పొందే అవకాశం ఉంది. మార్గదర్శకాల ఆకృతులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) అధికారులు పనిచేస్తున్నారని వర్గాలు తెలిపాయి. షాపింగ్ మాల్స్, జిమ్‌లను తిరిగి తెరవడం వంటి అంశాల‌ను అధికారులు చూస్తున్నారని, అయినప్పటికీ ప్రస్తుతానికి తుది నిర్ణయం రాలేదని అధికారిక వ‌ర్గాలు పేర్కొన్నారు.

అయితే మార్చి 24 నుండి మూసివేసిన షాపింగ్ మాల్స్ అనుమ‌తించ‌డంపై ఆందోళ‌నలు ఇంకా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించే అవ‌కాశం ఉండ‌టంతో వీటిని అనుమతించడంపై కాస్తా ఇబ్బందులు ఏర్పాడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు జూన్ 1 నుండి విద్యా సంస్థలను ప్రారంభించడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. కాని కేంద్ర హోం శాఖ‌ అలా చేయటానికి ఇష్టపడలేదు. అయితే సినిమా హాళ్ళు, ఇతర వినోద ప్రాంతాల‌ను తెరవడంపై నిషేధం మే 31 తరువాత‌ కూడా కొనసాగవచ్చు. మెట్రో రైలు సేవలను ప్రారంభించటానికి ఢిల్లీ వంటి రాష్ట్రాల నుండి సూచనలు కూడా ఉన్నాయి. కొత్త మార్గదర్శకాలు లాక్ డౌన్‌ 4.0 కోసం ప్రకటించిన నిబంధ‌న‌ల్లో మరింత వెసులుబాటు క‌ల్పించ‌వ‌చ్చ‌ని వర్గాలు తెలిపాయి.