Idream media
Idream media
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల్లో నిరర్ధకరమైన వాటిని విక్రయించే విధానంపై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించింది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీకి చెందిన 50 నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఇటీవల సమీక్ష చేసిన సందర్భంగా అదే తెలుగుదేశం, బీజేపీ నేతలు వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా టీటీడీకి భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తులు అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేస్తూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గత వారం రోజులుగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తుల వెనుక దాగిన కుట్రపై విజిలెన్స్ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ చేయించాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
ఈ వివరాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఆస్తుల అమ్మకంపై పలు రాజకీయ పక్షాలు, మీడియా చేసిన దుష్ప్రచారాన్ని ఆయన మరోసారి ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం మేరకు భక్తులు కానుకల ద్వారా ఇచ్చిన ఆస్తులు ఉపయోగకరంగా లేకపోయినప్పటికీ వాటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉపయోగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి స్వామీజీలు, మేధావులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
దేవస్థానం ఆధ‍్వర్యంలో చిన్న పిల్లల ఆస్పత్రి
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రి లేక అప్పుడే పుట్టిన పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్ని సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని, ఆ విషయంపై బోర్డులో చర్చించి బర్డ్ ఆసుపత్రిలో గానీ, స్విమ్స్ ఆసుపత్రిలో గానీ చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని తీర్మానించామని చెప్పారు. లాక్‌డౌన్ ముగిశాక ప్రభుత్వ అనుమతి తీసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలతో భక్తులకు ఏవిధంగా దర్శనం కల్పించవచ్చనే అంశంపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. వాటిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.