Idream media
Idream media
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సిటింగ్ ఎంపీగా కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. కవితను పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారని టీఆర్‌ఎ్‌సలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాలంలో కవిత ప్రజా క్షేత్రం నుంచి గెలిచి వస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. మారిన సమీకరణాలతో సిటింగ్ ఎంపీ (రాజ్యసభ) కె.కేశవరావు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురే్‌షరెడ్డికి పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. వారు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే బుధవారం వారిద్దరి ఏకగ్రీవ ఎన్నికపై ఈసీ అధికార ప్రకటన చేయనుంది.
టీఆర్‌ఎస్ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రె్‌సలో చేరిన డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడింది. అర్ధంతరంగా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుండగా, ఈసీ ఎన్నిక ప్రక్రియ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా, బుధవారం కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ నిలిచినప్పటికీ, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత ఇబ్బంది లేకుండా గెలుస్తారని పార్టీల బలాబలాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టీఆర్‌ఎస్ ఓట్లు 592 కాగా, కాంగ్రెస్ 142, బీజేపీ ఓట్లు 90 చొప్పున ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపి లు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కవిత ఎన్నిక లాంఛనమేనని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె ఎమ్మెల్సీగానే పరిమితం కాదని, కాబోయే మంత్రి అనే చర్చ అప్పుడే మొదలైంది. ఎన్నికల నాటికి కేటీఆర్ సీఎం అవుతారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఆ సమయంలో కవిత కూడా మంత్రివర్గంలో చేరుతుందని టిఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కేటీఆర్ సీఎం ఐతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని అంచనా. జాతీయ రాజకీయాల పై కేసీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో తన ఆసక్తిని వెలిబుచ్చారు.