iDreamPost
iDreamPost
నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుండి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి తగిన బలం లేకపోయినా వర్ల రామయ్యని టీడీపీ తరపునబరిలోకి దించి పోలింగ్ జరిగేలా చంద్రబాబు చేశారు.
అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ అభ్యర్థులు నలుగురూ గెలవగా టీడీపీ ఊహించిన విధంగా అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లే కాక మరొక ఓటు తగ్గింది . టీడీపీ ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీ పొరపాటు ఫలితంగా వర్ల రామయ్యకి 17 ఓట్లు మాత్రమే వచ్చాయి . అందరూ ఊహించినట్టే ఏ విధమైన ఎన్నికల వేడి లేకుండానే ఏకపక్షంగా జరిగాయి .
కానీ 25 ఏళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తీవ్ర హోరాహోరీ పోరు నడిచింది . 1995 సెప్టెంబర్ లో చంద్రబాబు వైస్రాయ్ క్యాంపుతో ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి తాను ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ పార్టీ ఆస్తులు , బ్యాంక్ అకౌంట్లు కూడా కోర్టు ద్వారా చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు . 1996 జనవరి 18 న పార్టీ , బ్యాంక్ అకౌంట్ల మీద తీర్పు వచ్చిన రోజు ఎన్టీఆర్ తీవ్ర వత్తిడికి గురై గుండెపోటుతో మరణించారు . ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎన్టీఆర్ పట్ల , లక్ష్మీపార్వతి పట్ల సానుభూతి ఏర్పడిందని పత్రికల్లో వార్తలు వచ్చాయి . ఇలాంటి పరిస్థితుల్లో 1996 ఫిబ్రవరి మూడవ వారంలో ఆంధ్రప్రదేశ్ లో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఆనాటి బలాబలాల్ని బట్టి చూస్తే టీడీపీకి 186 , మిత్రపక్ష కమ్యూనిస్ట్ లకి 34 ఎమ్మెల్యేల బలం ఉండగా , కాంగ్రెస్ కి 26 , లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీకి 34 , MIM 1,MBT 2 ,బిజెపికి మూడు స్థానాలు ఉన్నాయి. 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో తొమ్మిదిమంది టీడీపీకి,ఎడ్మా కృష్ణారెడ్డి మరియు దామోదర్ రెడ్డి కాంగ్రెసుకు మద్దతు ఇచ్చారు. గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ టీడీపీ కి మద్దతుగా ఉండేవారు.
ఈ బలాబలాల ప్రకారం ఒక్కో అభ్యర్థికి 42 ఓట్లు అవసరం . ఈ లెక్కల ప్రకారం టీడీపీకి ఐదు సీట్లకి మాత్రమే సరిపోను బలం ఉంది . ఆరో సీటు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ కి కానీ , ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎన్టీఆర్ టీడీపీకి కానీ దక్కవలసి ఉంది .
ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున జయప్రద ,యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ,సైఫుల్లా,సోలిపేట రామచంద్రారెడ్డి మరియు మిత్రపక్షమైన సీపీఎం తరుపున యలమంచిలి రాధాకృష్ణ పోటీ చేశారు.
దక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి పోటీ
దక్కన్ క్రానికల్ ఎండీగా ఉన్న వెంకట్రామిరెడ్డి 1994 లో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు .వెంకట్రామిరెడ్డి తండ్రి 1981-1993 మధ్య మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన 1993 డిసెంబరులో చనిపోయారు. 1994 జనవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ తరుపున గెలిచారు కానీ దాని కాలపరిమితి రెండు సంవత్సరాలే కావటంతో 1996 ఫిబ్రవరిలో అతని పదవీ కాలం ముగిసింది. ఆరో సీటు కోసం వెంకట్రామిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. కాంగ్రెస్ గుర్తు మీద ఇతర పార్టీ ఎమ్మెలేలు ఓటు వేయరన్న భావనతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. వెంకటరామిరెడ్డి తరుపున నాడు కాంగ్రెస్ లో ఉన్న మైసూరా రెడ్డి మంత్రాంగం నడిపాడు.
Also Read: వైయస్సార్ ఓటమి అంచుల వరకు వెళ్లిన 1996 లోక్ సభ ఎన్నిక
తోడల్లుడిని అడ్డుకోవటం ఎలా?
వైస్రాయ్ ఘటనలో బాబుకి అండగా ఉన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తర్వాత కొన్ని రోజులకే ఎన్టీఆర్ వైపు తిరిగి వచ్చేసారు. ఎన్టీఆర్ మరణం తరువాత లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు.
1996 రాజ్యసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వర రావు బరిలోకి దిగారు. దగ్గుబాటి అనేక మంది నేతలకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్స్ ఇప్పించి ఉండటం , చాలా మంది టీడీపీ నేతలతో అతనికి ఆంతరంగిక సంబంధాలు ఉండటంతో ఆయన గెలుపు సులభమని ప్రచారం జరిగింది .
మరోవైపు లక్ష్మీపార్వతి వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను వెంకటరామిరెడ్డి డబ్బులిచ్చి కొన్నాడని ప్రచారం జరిగింది . తదనంతరం వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై చివరివరకూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది .
ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రత్న కుమారి చంద్రబాబు పక్షంలో చేరారు. గద్దె రామ్మోహన్ కూడా దగ్గుబాటిని వీడి చంద్రబాబు వైపు వెళ్లిపోయారు.
చంద్రబాబు తనకున్న వైస్రాయ్ క్యాంపు రాజకీయాల అనుభవంతో రామకృష్ణ స్టూడియోలో క్యాంప్ నిర్వహించగా , కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు మాత్రం తాము క్యాంపుకి రామని తమని ఎవరూ కొనలేమని తేల్చిచెప్పారు .
మరోవైపు దగ్గుబాటి వర్గం నుండి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు వెళ్లిపోయారు . దరిమిలా దగ్గుబాటి మిగిలిన ముప్పై ఒక్క మందితో జూబ్లీహిల్స్ లో సినీ నిర్మాత సి. అశ్వినీదత్ కి చెందిన గెస్ట్ హవుస్ లో క్యాంపు ఏర్పాటు చేశారు .
వెంకట్రామిరెడ్డి తరుపున మైసూరా రెడ్డి తెర వెనుక రాజకీయం నడిపారు .ఆనాడు మైసూరా రెడ్డి డెక్కన్ క్రానికల్ డైరెక్టర్ గా ఉండటం గమనార్హం .
అప్పట్లోనే పోలింగ్ నాడు ఎన్నికలలో కంప్యూటర్ ఇచ్చే కోడ్లు , సీరియల్ నంబర్ల ఆధారంగా ఒక్క ఓటు కూడా జారిపోకుండా చూడాలని చంద్రబాబు ప్రయత్నించారు . కానీ నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ఎన్నికల కోడ్ గట్టిగా అమలుపరచడంతో అది సాధ్యం కాలేదు .
టీడీపీ అభ్యర్థులు నలుగురు , మిత్రపక్షం సీపీఎం అభ్యర్థి గెలుపొందారు . 33 ఓట్లతో ఆరోసీటు దగ్గుబాటి గెలిచారు. ,ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వెంకట్రామిరెడ్డికి ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి .
చరిత్రలో లక్ష్మీపార్వతి సాధించిన విజయాలు ఏమిటి అంటే ఆమె పాతపట్నంలో ఎమ్మెల్యేగా గెలవడం ఒకటి , రెండూ ఎన్టీఆర్ టీడీపీ తరపున దగ్గుబాటి రాజ్యసభకి ఎంపిక కావడం . ఇవి రెండే ఆమె రాజకీయ జీవితంలో చెప్పుకోదగ్గ విజయాలు .
లక్ష్మీపార్వతి వివాదాస్పద పాత్ర .
ఎన్నికలు ముగిసిన తర్వాత వెంకటరామిరెడ్డి దగ్గుబాటికి ఫోన్ చేసి మీ పార్టీలో 14 మందికి డబ్బులిచ్చానని,వారిలో కొందరు ఓట్లు వేయకుండా మోసం చేశారని కాబట్టి వాళ్ళను నమ్మొద్దు అని చెప్పినట్లు “ఒక చరిత్ర కొన్ని నిజాలు” పుస్తకంలో దగ్గుబాటి రాశారు .
దీంతో దగ్గుబాటి తనకు ముప్పైమూడు ఎలా వచ్చాయి అని కారణాలు వెతగ్గా చంద్రబాబు వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు తనకు ఓట్లేశారని తెలిసిందని రాసుకొచ్చారు . దాదాపు డెబ్భై మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ ద్వితీయ ప్రాధాన్యతా ఓటుని వేశారని దగ్గుబాటి రాశారు .
ఏ అభ్యర్థి అయినా మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలవకపోతే ఈ ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను కూడా పరిగణిస్తారు.పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన దగ్గుబాటి ఆ విధంగా తొలిసారి రాజ్యసభకి ఎన్నికయ్యారు , అదే చివరిసారి కూడా . రాజ్యసభ ఎన్నికల్లో డబ్బు వ్యవహారంతో లక్ష్మీపార్వతి దగ్గుబాటి మధ్య ఏర్పడ్డ స్పర్ధలు 1996 లోక్ సభ ఎన్నికల్లో తీవ్రరూపం దాల్చాయి.
కొద్దికాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న దగ్గుబాటి 1998 లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయారు. దగ్గుబాటి 2004,2009లో కాంగ్రెస్ తరుపున గెలవటం,2014 ఎన్నికల్లో దూరంగా ఉండటం,2019లో వైసీపీ తరుపున పర్చూరు నుంచి పోటీచేసి ఓడిపోవటం తెలిసిందే.
Also Read: 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ..
క్రాస్ వోటింగ్ కు పరాకాష్ట 1982 రాజ్యసభ ఎన్నికలు
1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి చెన్నారెడ్డి,అంజయ్యల తరువాత భవనం వెంకట్ రామ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1982 మార్చ్ మూడవ వారంలో ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీ జరిగింది.
1978 ఎన్నికల్లో జనతాపార్టీ 60,జాతీయ కాంగ్రెస్ 30 స్థానాలు మాత్రమే గెలవగా ఇందిరా కాంగ్రెస్ 178 స్థానాలు గెలిచింది. ఫలితాలు వచ్చిన నెలలోనే జాతీయ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందిరా కాంగ్రెసులో చేరిపోయారు. జనతా పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు విడతలవారీగా ఇందిరా కాంగ్రెసులో చేరారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపుల చట్టం లేదు.. 1982 రాజ్యసభ ఎన్నిక నాటికి జనతాపార్టీలో పట్టుమని ఐదుగురు ఎమ్మెలేలు కూడా మిగలలేదు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మాజీ హోమ్ మంత్రి ఎం ఎం హషీమ్, ఆంధ్రజ్యోతి యజమాని కె ఎల్ ఎన్ ప్రసాద్,వై.ఆదినారాయణ రెడ్డి,ఎస్.బి.రమేష్ బాబు,బి.రామచంద్రరావు మరియు రాయపాటి సాంబశివ రావు పోటీచేయగా,జనతాపార్టీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.బాబుల్ రెడ్డి(వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి తండ్రి) ,ఇండిపెండెంట్ గా టి.కే.కోదండరాం పోటీచేశారు.
ఆ ఎన్నికల్లో గెలవటానికి 41.5 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం.ఇందిరా కాంగ్రెస్ తమ అభ్యర్థులు హషీమ్,ఎల్ ఎన్ ప్రసాద్,వై.ఆదినారాయణ రెడ్డి,ఎస్.బి.రమేష్ బాబు, బి.రామచంద్రరావులకు 45 ఓట్ల వంతున రాయపాటికి 31 ఓట్లను కేటాయించింది. అంటే ఓడిపోతే రాయపాటి ఓడిపోవాలి. లోక్ దళ్,సిపిఐ,సిపిఎం,బీజేపీ,టీడీపీలో చేరుతున్నాం అని ప్రకటించిన నాదెండ్ల వర్గం ఇందిరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు(నాదెండ్ల,గద్దె పెద్ద రత్తయ్య,ఆదెయ్య చిన్నయ్య) మొత్తంగా 36 మంది మద్దతు జనతాపార్టీ అభ్యర్ధికి దక్కింది.
క్రాస్ వోటింగ్ జరుగుతుందన్న అనుమానంతో కాంగ్రెస్ అధిష్టానం సీతారాం కేసరి,మూపనార్లను పరిశీలకులుగా పంపించింది. అయినా కానీ 30 మందికి పైగా ఇందిరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు.
36 ఓట్ల బలము మాత్రమే ఉన్న జనతా బబుల్ రెడ్డికి 56 ఓట్లు రాగ ,31 ఓట్లు మాత్రమే కేటాయించిన రాయపాటికి 46 ఓట్లు వచ్చాయి. వీరిద్దరే మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆదినారాయణ రెడ్డి 40,రామచంద్ర రావు 39,కె ఎల్ ఎన్ ప్రసాద్ 37,రమేష్ బాబు 33 మరియు హషీమ్ కు 32 ప్రధమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆదినారాయణ రెడ్డి ,రామచంద్ర రావు గెలిచారు. రమేష్ బాబు మూడవ ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. నాలుగు మరియు ఐదవ ప్రాధాన్యాత ఓట్ల లెక్కింపులో ఎవరు గెలవక పోవటంతో చివరిదైన ఆరవ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో కె ఎల్ ఎన్ ప్రసాద్ గెలిచారు. అందరికన్నా ముందు గెలువవలసిన హషీమ్ మాత్రం ఓడిపోయారు.. ఇండిపెండెంట్గా పోటీ చేసిన టి.కే.కోదండరాం కు ఒక్క ఓటు కూడా రాలేదు.. అంటే ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు ఓటు వేయలేదు.. ఆ విధంగా 1982 రాజ్యసభ ఎన్నికలు క్రాస్ ఓటింగుకు పరాకాష్టగా నిలిచాయి.
Also Read: రాజ్యసభ చరిత్రలో తొలి సారి ఉనికిని కోల్పోయిన ఆంద్రప్రదేశ్ భారత జాతీయ కాంగ్రెస్
1982 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అంటే 29-Mar-1982న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. రెండు వేరు వేరు అంశాలు అయినా భవిష్యత్తు రాజకీయానికి పునాది వేసిన విషయాలు.. అదే రోజు తన అత్త ఇందిరా ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేనకా గాంధీ “సంజయ్ విహార్ మంచ్” ను ఏర్పాటు చేసి 1983 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఐదు సీట్లు గెలిచారు.
ఆనాటి ఎన్నికలతో పోల్చుకొంటే ఈనాటి ఎన్నికలు ఏ విధమైన ఉత్కంఠ లేకుండా చాలా సాదాసీదాగా జరిగాయి అని చెప్పొచ్చు .