iDreamPost
android-app
ios-app

మైత్రి సంస్థకు కొత్త సవాళ్ల స్వాగతం

  • Published Dec 08, 2022 | 4:51 PM Updated Updated Dec 08, 2022 | 5:20 PM
మైత్రి సంస్థకు కొత్త సవాళ్ల స్వాగతం

మహేష్ బాబు శ్రీమంతుడుతో ఇండస్ట్రీ నిర్మాణంలో అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. రంగస్థలం, జనతా గ్యారేజ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అలా అని అన్నీ హిట్లే లేవు కానీ అంటే సుందరానికి, హ్యాపీ బర్త్ డే లాంటి డిజాస్టర్లు లేకపోలేదు. తాజాగా ఈ బ్యానర్ స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇవాళే పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ ఆఫీస్ మొదలుపెట్టారు. తిరుపతికి చెందిన ఓ ప్రముఖ పంపిణీదారుడు ఇందులో సగం వాటా పెట్టారనే టాక్ ఉంది కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే చాలా సవాళ్లు ఎదురు చూస్తున్నాయి.

నైజామ్ లో దిల్ రాజు, ఆసియన్ లాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ లో తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్నారు. వాళ్ళకంటూ స్వంతంగా థియేటర్లు, లీజుకు తీసుకున్న స్క్రీన్లు, మల్టీ ప్లెక్సులు ఉన్నాయి. ఏళ్ళ తరబడి ఈ రంగంలో పండిపోయి ఉన్నారు. కానీ మైత్రికి ప్రొడక్షన్ లో ఎంత అనుభవం ఉన్నా ఈ పంపిణి వ్యవహారం నేరుగా చేయడం కొత్తదే. అసలైన సవాల్ దీనికంటే పెద్దది ఉంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రిలీజవుతున్నాయి. ఒకపక్క వారసుడుకి మంచి థియేటర్లు లాక్ అవుతున్నాయని ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో నెత్తినోరు బాదుకుంటున్న తరుణంలో ఈ ఇష్యూ ని బాలన్స్ చేయడం సులభం కాదు

ఫిలిం ఛాంబర్ నుంచే కాక కీలక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల దగ్గరి నుంచి చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు ఎంత మద్దతు దక్కుతున్నా నిజంగా దిల్ రాజుని కాదని వారసుడుని నియంత్రించగలరా అనే దాని మీద పెద్ద డిబేట్ జరుగుతోంది. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే వీరయ్య వీరసింహాలకు తగినంత పెద్ద రిలీజ్ ఇవ్వలేకపోయారనే నింద మోయాల్సి వస్తుంది. ఒకే నిర్మాణ సంస్థ కావడంతో మైత్రికి ఈ ఒత్తిడి మాములుగా ఉండదు. చేతిలో ఉన్న నెల రోజుల టైంలో ఇవన్నీ చూసుకుంటునే ప్రమోషన్లు పబ్లిసిటీ గట్రా ప్లాన్ చేసుకోవాలి. మరి మైత్రి మొదట్లోనే ఎదురవుతున్న ఈ సవాళ్ళను విజయవంతంగా గట్టెక్కగలిగితే తిరుగు లేనట్టే. చూద్దాం