iDreamPost
iDreamPost
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి ప్రభుత్వానికి తమ వంతు చేయూతనిస్తున్నాయి టాలీవుడ్ పెద్ద మనసులు. ఒకటి రెండు రోజులు ఆలస్యమవుతున్నట్టు అనిపిస్తున్నా నిజానికి ఇదే సరైన సమయం. చర్యలు ఇప్పుడిప్పుడే వేగమందుకుంటున్నాయి. జనంలో కూడా చైతన్యం వచ్చి తమ వంతుగా సహాయం చేసేందుకు స్ఫూర్తి పొందుతారు.
అధికారిక లాక్ డౌన్ ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఆ మేరకు చిన్నా చితకా కార్మిక వర్గాలకు భుక్తిని అందించడం ఇప్పుడు ప్రధానంగా చేయాల్సిన కర్తవ్యం. అంతేకాదు వైద్య సేవల్లో ప్రమాణాలు పెంచి రానున్న రోజుల్లో రోగుల సంఖ్య కనక పెరిగితే దానికి అనుగుణంగా వసతులను ముందే సిద్ధం చేయాల్సి ఉంటుంది . అందుకే సినిమా పరిశ్రమ నుంచే కాక వివిధ రంగాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటిదాకా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మొత్తంతో బిగ్గెస్ట్ డోనర్ గా నిలిచారు. ప్రధాన సహాయ నిధికి కోటి రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి వెరసి 2 కోట్లు ఇవ్వడం పట్ల అభిమానులే కాదు సామాన్య ప్రజానీకం సైతం హర్షం వ్యక్తం చేస్తోంది. మహేష్ బాబు సైతం 1 కోటిని ప్రకటించడం హర్షించదగ్గ విషయం. బాబాయ్ బాటలో నడుస్తూ ఇవాళ రామ్ చరణ్ 70 లక్షల సాయాన్ని ప్రకటించడం ఇప్పటికే చర్చగా మారింది. మెగాస్టార్ చిరంజీవి కొన్ని నిమిషాల క్రితం రోజువారీ వేతనం మీద ఆధారపడి సినీ కార్మికుల కోసం 1 కోటి రూపాయలు వ్యక్తిగతంగా ప్రకటించారు.
దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తరఫున ఎపి, తెలంగాణలకు చెరి 10 లక్షలు ఇందాకే ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కలిపి త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 లక్షలు ఇవ్వగా, అనిల్ రావిపూడి 10 లక్షలు, కొరటాల శివ 10 లక్షలు ఇస్తూ తమ పెద్ద మనసు చాటారు. అందరి కంటే ముందుగా స్పందించిన నితిన్ 10 లక్షలు ఇవ్వడాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. క్రీడాకారిణి పివి సింధు సైతం 5 లక్షలు ప్రకటించడం గమనార్హం. ఈ జాబితా అంతకంతా పెరుగుతూ పోయే అవకాశం ఉంది.