iDreamPost
android-app
ios-app

ఒక ఎన్నిక.. మూడు పార్టీలు.. మూడు లక్ష్యాలు..

ఒక ఎన్నిక.. మూడు పార్టీలు.. మూడు లక్ష్యాలు..

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలున్నాయి. అన్ని పార్టీలు పోలింగ్‌కు సిద్ధమవుతున్నాయి. రేపు ఉదయం పోలింగ్‌ ప్రారంభం కాబోతోంది. సాయంత్రానికి ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్‌ను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తారు. మే 2న ఎవరి భవిష్యత్‌ ఏమిటో తేలిపోతుంది.

ఎవరి లక్ష్యాలు వారివి..

అధికార వైసీపీ సహా ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ–జనసేన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు పార్టీల లక్ష్యాలు భిన్నమైనవి. గతం కన్నా ఎక్కువ మెజారిటీ సాధించాలని వైసీపీ, చావుబతుకుల సమస్య నుంచి బయటపడాలని, తన స్థానంలోకి బీజేపీని రానీయకుడదని టీడీపీ, ఎలాగైనా సరే రెండో స్థానంలో నిలిచి టీడీపీ స్థానం ఆక్రమించాలని బీజేపీ.. ఇలా ఎవరి లక్ష్యాలు వారు నిర్ధేశించుకున్నాయి.

వైసీపీ బలమెంత..?

2019 జనరల్‌ ఎన్నికల తర్వాత వైసీపీ బలం మరింత పెరిగిందని ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ద్వారా తేటతెల్లమైంది. అయితే ఈ ఫలితాల ఆధారంగా చేసుకుని వైసీపీ బలాన్ని పూర్తి స్థాయిలో నిర్థారించలేము. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. స్థానిక అంశాలు, అభ్యర్థులు, బంధుత్వాలు.. ఇలా అనే అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి

కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాల ద్వారా ఏ పార్టీ శక్తి ఎంతో తేల్చవచ్చు. లోక్‌సభ ఎన్నికలకు కావడం, పార్టీలు, ఆ పార్టీ అధినేతలను చూసి ఓటర్లు తీర్పు ఇస్తారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రజలను ఏ స్థాయిలో మెప్పించాయో ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. ఆది నుంచి వైసీపీ 3 లక్షలు ఆపై మెజారిటీపైనే దృష్టి పెట్టింది. అయితే ఆ మెజారిటీ వస్తుందా..? రాదా..? అనేది నమోదయ్యే పోలింగ్‌ శాతాన్ని బట్టి అంచనా వేయొచ్చు.

Also Read : బై పోల్ : తెలుగు రాష్ట్రాల్లో ఏంటి ప‌రిస్థితి..?

ఈ సారి పోలింగ్‌ శాతం ఎంత..?

గత ఎన్నికల్లో 79.76 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. 13,16,473 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. ఇటీవలే పంచాయతీ, మున్సిపల్, పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం బయట ప్రాంతాలకు వెళ్లిన వారు మళ్లీ ఎంత మేరకు వస్తారనేది ప్రధాన ప్రశ్న. ఈ పరిణామాలు పోలింగ్‌ శాతంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం లేదా అంతకన్నా ఈ సారి పోలింగ్‌ జరిగితే.. వైసీపీ ఆశించినట్లుగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర అంశాల చుట్టూనే ప్రచారం..

ఈ ఎన్నికల్లో ప్రచారం అంతా రాష్ట్ర స్థాయి అంశాల చుట్టే తిరిగింది. ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, విభజన హామీలను ప్రస్తావిస్తూ బీజేపీని అధికార పార్టీ కార్నర్‌ చేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు అంటూ టీడీపీ, బీజేపీ నేతలు విమర్శనస్త్రాలు సంధించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రచారానికి దూరంగా ఉన్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు 8 రోజులుగా తిరుపతి లోక్‌సభలో తిష్టవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారానికి వచ్చారు. బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా జనసేన అధినేత పవన్‌ ప్రచారం చేశారు.

ఉప ఎన్నిక కావడం, అదీ ఒక స్థానంలో ఎన్నిక జరగడంతో అన్ని పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఫలితాలు.. ఆయా పార్టీల బలాబలాలను తేటతెల్లం చేస్తాయి. ముఖ్యంగా బీజేపీ–జనసేన బలం ఎంతనేది తేలిపోతుంది. అందుకే ఈ ఎన్నికలకు పోటీలో ఉన్న అన్ని పార్టీలతోపాటు పోటీలోలేని జనసేనకు కూడా అసలైన పరీక్ష. ఈ పరీక్షలో ఆయా పార్టీలు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాయో లేదో.. మే 2వ తేదీన వెల్లడయ్యే ఫలితాలతో తేలిపోతుంది.

Also Read : తిరుపతిలో బిజెపి తుది ఎత్తుగడ..!