iDreamPost
iDreamPost
ఇప్పుడంటే ప్రత్యేకంగా కామెడీ సినిమాలు బాగా తగ్గిపోయాయి కానీ 1980 నుంచి 2000 మధ్యలో చాలానే వచ్చాయి. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, నరేష్ ల హయాంలో బ్లాక్ బస్టర్స్ అయినవి ఎన్నో. వీళ్ళ ప్రభ తగ్గాక కూడా తెలుగులో అడపాదడపా మంచి చిత్రాలు రాలేదని కాదు కానీ గతంతో పోలిస్తే కౌంట్ తగ్గింది. శ్రీకాంత్ లాంటి హీరోలు ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం ద్వారా ఈ జానర్ లో ఏర్పడిన వ్యాక్యూమ్ తగ్గించే ప్రయత్నం చేశారు. అలా క్షేమంగా వెళ్లి లాభంగా రండి సూపర్ హిట్ తర్వాత ఆ కోవలో చెప్పుకోదగ్గ మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి తిరుమల తిరుపతి వేంకటేశ. దీని విశేషాలు తెలియాలంటే అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దాం.
1999. తమిళంలో సుప్రసిద్ధ దర్శకులు రామ నారాయణ్ తన 100వ సినిమాగా తిరుపతి ఎజుమలై వేంకటేశ తీశారు. ప్రభు – ఎస్వి శేఖర్ – వడివేలు ప్రధాన పాత్రల్లో రోజా – ఊర్వశి – కోవై సరళ వాళ్లకు జంటగా వినోదాత్మకంగా దాన్ని తీసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా కమర్షియల్ గానూ మంచి సక్సెస్ అందుకుని ఆయన మైల్ స్టోన్ చేదు జ్ఞాపకంగా మారకుండా కాపాడింది. దీన్ని రీమేక్ చేసే ఉద్దేశంతో అప్పటి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల, కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా హక్కులు కొని పునఃనిర్మించేందుకు నిర్ణయించుకున్నారు. అప్పటికే వీళ్ళ బ్యానర్ ఫ్రెండ్లీ మూవీస్ మీద పలు హిట్ సినిమాలు వచ్చాయి. దర్శకుడిగా సత్తిబాబు ఎంపిక కాగా ఒరిజినల్ వెర్షన్ లోని మూడు పాత్రలను శ్రీకాంత్ – రవితేజ – బ్రహ్మానందం పోషించారు.
అప్పటికి మాస్ మహారాజాకు ఇంకా సోలో మార్కెట్ బలపడలేదు. అందుకే ఇలా సపోర్టింగ్ రోల్స్ కూడా వేసేవారు. కృష్ణప్రసాద్ సంభాషణలు సమకూర్చగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. రోజా-కోవై సరళ ఇందులోనూ రిపీట్ అయ్యారు. మూడో క్యారెక్టర్ కోసం గులాబీ ఫేమ్ మహేశ్వరి ఫిక్స్ అయ్యింది. సంపాదన లేని ముగ్గురు మధ్యతరగతి యువకులు గొప్పలకు పోయి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ జీవితంలో వచ్చే మార్పులు. గొప్పలకు పోయే పెళ్లాలకు బుద్ది చెప్పే వైనం అసలు కథ. 2000 డిసెంబర్ 21న తిరుమల తిరుపతి వేంకటేశ విడుదలై సక్సెస్ అందుకుంది. అదే రోజు ఎక్కువ అంచనాలతో వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి – ఏఎన్ఆర్ – శ్రీకాంత్ ల కాంబినేషన్ లో వచ్చిన సకుటుంబ సపరివార సమేతం వెనుకబడి ఫ్లాప్ అందుకోవడం ఫైనల్ ట్విస్ట్
Also Read : Border : ఇండియా పాకిస్థాన్ యుద్ధానికి సజీవ రూపం – Nostalgia