iDreamPost
android-app
ios-app

శ్రీవారి దర్శనానికి ఇదే మార్గదర్శనం

శ్రీవారి దర్శనానికి ఇదే మార్గదర్శనం

కరోనా వైరస్‌ వల్ల రెండు నెలలకు పైగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కోల్పోయిన భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రార్థనామందిరాలు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 8,9 తేదీత్లో కొండపై ఉన్న టీటీడీ ఉద్యోగులకు, 10వ తేదీలో స్థానికులకు, 11వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు స్వామి వారి దర్శనం కల్పింస్తున్నట్లు చెప్పారు.

కరోనా వైరస్‌ ఇంకా ఉన్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు.. 11వ తేదీ నుంచి రోజుకు 6వేల మందికి మాత్రమే స్వామి వారి దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే వారిలో మూడు వేల మందికి, నేరుగా వచ్చే వారికి మరో మూడు వేల మందికి దర్శనం కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. పది ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనుమతించడంలేదని లేదన్నారు. కంటైనమెంట్‌ జోన్లు, రెడ్‌జోన్ల నుంచి భక్తులు రావద్దని సూచించారు.

ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అలిపిరి మార్గంలోనూ, రాత్రి 8 గంటల వరకూ కనుమ మార్గంలోనూ భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఇంకా కొద్ది రోజుల పాటు మెట్టమార్గం మూసే ఉంచాలని నిర్ణయించినట్లు వైవీ తెలిపారు. భక్తులు హుండీలో కానుకలు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టామన్నారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు. కొండపై ఉన్న అన్ని దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తితే కంపార్ట్‌మెంట్లలో 100 మంది చొప్పున ఉంచుతామని చెప్పారు. దాదాపు వేచి ఉండే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

8వ తేదీ నుంచి స్వామి వారి దర్శనం పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న స్వామి వారి ప్రసాదం (లడ్డు) విక్రయాలను 8వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామి వారి దర్శనంతోపాటు ప్రసాదాలు అందిస్తామన్నారు. పుష్కరణిలోకి భక్తులను అనుమతించబోమని చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి దేవాలయ ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.