హైదరాబాద్ మరియు చుట్టు పక్కల సరిహద్దు రాష్ట్రాల నుండి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు వచ్చిన వారికి సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు పేర్కొంది. బయట ప్రాంతాల నుండి వచ్చిన వారు బయట తిరిగేందుకు వీలులేదని, ఒక వేళ ఎవరైనా ఆ నిభంధనలు ఉల్లంఘించినట్టు తేలితే అటువంటి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇతర రాష్ట్రాలు నుండి ఎవరు రాష్ట్రంలో అడుగుపెట్టాలనుకున్నా, వారినుండి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామన్న లిఖితపూర్వక హామీని తీసుకోవాలని సూచించింది. వారిపై గట్టి నిఘా కుడా ఉంచాలని పోలీసులను ఆదేశించింది. కాగ, చిన్న పిల్లలున్న మహిళలు, గర్భిణుల విషయంలో అధికారులు కొంత మానవతా దక్పథంతో వ్యవహరించాలని హైకోర్ట్ సూచించింది.
ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు రాష్ట్రంలోకి ఎవరినీ రానివ్వడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వైద్యులు, నర్సులు తదితరులకు ఎన్–95 మాస్కులు అందజేసేలా ఆదేశాలివ్వాలంటూ మరో పిల్ దాఖలైంది. వీటన్నింటిని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. వీటన్నింటిపై వేర్వేరుగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.