iDreamPost
android-app
ios-app

ట్రంప్‌ తెంపరితనం.. అగ్రరాజ్యం అతలాకుతలం..

ట్రంప్‌ తెంపరితనం.. అగ్రరాజ్యం అతలాకుతలం..

పేరుకు అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.. అతిపెద్ద ఆయుధ, రక్షణ, వైద్య వ్యవస్థ కలిగిన దేశం.. ఇవన్నీ ఒక కంటికి కనిపించని వైరస్‌ చేతిలో చిన్నబోయాయి. కొన్ని రోజుల కిందట వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఆ వైరస్‌లు తమ దేశాన్ని ఏమీ చేయలేవని ప్రగల్బాలు పలికారు. తమ దేశంలో దాని ప్రభావం ఏమీ ఉండదని బీరాలు పలికారు. అందుకే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు ఆ దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. చైనా, ఇటలీని దాటి కేసుల సంఖ్యలో మొదటి స్థానానికి చేరిపోయింది. కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష మార్కును దాటిపోయాయి. తాజా లెక్కల ప్రకారం 1,700 మంది మృతి చెందారు. చైనా, ఇటలీతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఆ దేశానికి ఊరటనిచ్చే అంశం.

న్యూయార్క్‌లో అయితే పరిస్థితి చేయిదాటిపోయింది. అనేక ప్రపంచస్థాయి కంపెనీలకు నెలవైన ఆ న్యూయార్క్‌ నగరం.. కరోనాకు కేంద్ర స్థానంగా మారిపోయింది. అక్కడ దాదాపు 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 400కు పైగా మరణాలు సంభవించాయి. ఇక న్యూయార్క్‌ రాష్ట్రం మొత్తం మీద 500 మంది దాకా మరణించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు కొలంబియా యూనివర్సిటీలో 1400 మంది ఉంటే ఏకంగా 1000 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఇంత జరుగుతున్నా అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ లాక్‌డౌన్‌ మాత్రం ప్రకటించడం లేదు. ఆర్థిక లెక్కలు వేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల కోట్లు కేటాయించినా మరణాల సంఖ్యను ఆపలేకపోతున్నారు. కొద్ది రోజుల్లోనే మరణాల సంఖ్యలోనూ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు కరోనా విజృంభన నేపథ్యంలో ఆ దేశంలోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మన దేశానికి రాలేక, అక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యావసరాలు కూడా అమెరికాలో దొరకని పరిస్థితి తలెత్తిందంటే అక్కడ పరిస్థితులు ఎంతకి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. టిష్యూ పేపర్లు, మంచి నీరు కూడా రేషన్‌ పద్దతిలో అందజేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అగ్రరాజ్యంలో ఆకలి చావులు మొదలవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.