iDreamPost
android-app
ios-app

త్వరలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు పునః ప్రారంభం

  • Published May 26, 2020 | 4:38 AM Updated Updated May 26, 2020 | 4:38 AM
త్వరలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు పునః ప్రారంభం

క‌రోనా లాక్‌డౌన్ తో ఆగిపోయిన పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశాలు త్వ‌ర‌లో పునః ప్రారంభ‌మైయ్యే అవ‌కాశ‌ముంద‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్, ఉప‌రాష్ట్రప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు తెలిపారు. దేశంలో క‌రోనా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వ‌ర్ష‌కాల పార్ల‌మెంట్ స‌మావేశాల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతుంది. ఒక‌పక్క దేశంలో క‌రోనా వైర‌స్ రోజు రోజుకి విజృంభిస్తుంది. మ‌రోవైపు జూన్ చివ‌రి వారంలోనైనా, జూలై మొద‌టి వారంలోనైనా పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు నిర్వ‌హించాల్సి ఉంది. కానీ పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ప్ర‌స్తుతం ప‌రిస్థితులు సానుకూలంగా లేవు. మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీలు ఆగిపోయాయి. వాటిని త్వ‌ర‌లోనే పునఃప్రారంభించాల‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. లాక్‌డౌన్ 4.0 లో విమాన, రైలు ప్రయాణాలు పునః ప్రారంభ‌మ‌వ్వ‌డంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడులతో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడానికి పార్లమెంటు సన్నద్ధమవుతోంది.

కరోనా వైరస్ నిబంధనల నేపథ్యంలో గదుల లభ్యత, పాటించాల్సిన నిబంధనల గురించి వెంక‌య్య నాయుడు, ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పార్లమెంటు హౌస్‌లో తొమ్మిది గదులు, 24 డిపార్ట్‌మెంట్ సంబంధిత స్టాండింగ్ కమిటీల రెగ్యులర్ సమావేశాలు, ఉభయ సభల ఇతర కమిటీలకు మరో ఆరు గదులు ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన కమిటీ గది (మెయిన్ క‌మిటీ రూం) మాత్రమే భౌతిక‌ దూర ప్రమాణాలకు కట్టుబడి కమిటీల సమావేశాలను ప్రారంభించ‌వచ్చు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య‌ నాయుడు, ఓం బిర్లా ఇతర గదులలో సామాజిక దూరాన్ని నిర్వహించడానికి అదనపు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

డిపార్ట్ మెంట్‌ సంబంధిత స్టాండింగ్ కమిటీలలో 31 మంది ఎంపిలు, లోక్ స‌భ‌ నుండి 21, రాజ్యసభ నుండి 10 మంది ఉన్నారు. ఉభయ సభల ఇతర ప్యానెల్లు చాలా తక్కువ మంది ఎంపిలను కలిగి ఉన్నాయి. రాజ్యసభ ఛైర్మన్, లోక్ స‌భ‌ స్పీకర్ ఇద్దరూ కూడా కమిటీల ముందు హాజరయ్యే సెక్రటేరియట్లు, మంత్రిత్వ శాఖల నుండి అధికారుల పాల్గొనడం భౌతిక‌ దూర ప్రమాణాలకు అనుగుణంగా కనీస స్థాయిలో ఉంచబడుతుంది. లాక్ డౌన్‌ 4.0 తరువాత నూత‌నంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన 37 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల‌ ప్రమాణ స్వీకారం చేయటానికి షెడ్యూల్ రూపొందించాలని రాజ్యసభ సచివాలయ అధికారులను వెంకయ్య నాయుడు ఆదేశించారు. ఈ విషయంలో రాజ్యసభ ప్ర‌తిప‌క్ష నేత‌ గులాం నబీ ఆజాద్‌తో కూడా మాట్లాడారు.

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడిన ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్య‌స‌భ ఖాళీల‌కు సంబంధించిన ఎన్నికలు గురించి వెంక‌య్య నాయుడు భారత ఎన్నికల సంఘంతో మాట్లాడారు. ఈ విషయాన్ని కమిషన్ పరిశీలిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది.
మే ప్రారంభంలో వెంక‌య్య నాయుడు, ఓం బిర్లా సమావేశాల నిర్వ‌హ‌ణ‌ అవకాశాలు, సురక్షిత సాంకేతిక వేదికలను ప్రారంభించడానికి అవసరమైన సమయంపై నివేదికను సమర్పించాలని లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ సెక్రటరీ జనరల్‌ను కోరారు. అంతకుముందు స్టాండింగ్ కమిటీ చైర్మన్ లు ఆనంద్ శర్మ (హోం), శశి థరూర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), భర్తృహరి మహతాబ్ (లేబర్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిటీల సమావేశాలను కోరినప్పటికీ లోక్ స‌భ‌, రాజ్యసభ కార్యదర్శులు ఇద్దరూ వారి విజ్ఞ‌ప్తిని తిరస్కరించారు. క‌రోనా వైర‌స్ లాక్ డౌన్‌ కింద ఉన్నప్పటికీ 23 దేశాలలో కనీసం పార్లమెంటులు సమావేశాలు నిర్వహిస్తున్నాయని మహతాబ్ లోక్ స‌భ స్పీక‌ర్‌ను ఒక లేఖలో కూడా కోరారు.