iDreamPost
android-app
ios-app

సమావేశం ముగిసింది.. ప్రధాని నిర్ణయమే మిగిలింది..

సమావేశం ముగిసింది.. ప్రధాని నిర్ణయమే మిగిలింది..

కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. కరోనా కట్టడి, లాక్ డౌన్ అమలు తోపాటు మే 3న ముగిసే లాక్ డౌన్ పై కూడా ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ చర్చించారు. లాక్ డౌన్ వల్ల కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రులతో పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల చాలా లాభాలు కలిగాయని వ్యాఖ్యానించారు. అందరం కలిసికట్టుగా పోరాటం వల్లే కరోనా ను నియంత్రించగలిగామనన్నారు.

లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు గా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని ప్రధాని నిర్ణయించినట్లు సమాచారం. ప్రాంతాల వారిగా అక్కడున్న పరిస్థితిని బట్టి మినహాయింపులు ఇవ్వాలనే ఆలోచనతో ప్రధాని మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా రవాణా పై ఆంక్షలు ఎప్పటిలాగే కొనసాగించే దిశగా ఆలోచన ను సీఎం లతో పంచుకున్నారు. వలస కూలీలు, విద్యార్థుల పై కూడా సమావేశంలో చర్చించారు.

కరోనా వైరస్ కట్టడి కోసం గత నెల 24వ తేదీన దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అది ఏప్రిల్ 14వ తేదీతో ముగియడంతో మరోమారు మే 3 వరకు పొడిగించింది. రెండో విడత గడువు మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ముఖ్య మంత్రులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, సలహాలు సూచనలు స్వీకరించారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ రెండో దఫా పొడిగిస్తూ ప్రకటన చేసే ముందు ప్రధాని మోదీ ఏప్రిల్ 11వ తేదీన ముఖ్య మంత్రులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే మే 3న లాక్ డౌన్ ముగుస్తుండగా.. ఈ రోజు మళ్ళీ సమావేశం అయ్యారు. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ప్రధాని మోడీ ఎప్పుడు ప్రకటిస్తారో అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలోలాగా చివరి రోజున ప్రకటిస్తారా..? లేదా అంతకు ముందుగానే వెల్లడిస్తారా..? అనేదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.