iDreamPost
android-app
ios-app

ఉద్ధవ్ థాకరేకు పదవీ గండం

ఉద్ధవ్ థాకరేకు పదవీ గండం

మహారాష్ట్ర గవర్నర్ తనను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నియమించాలనే క్యాబినెట్ తీర్మానంపై నిర్ణయాన్ని ప్రకటించకుండా సీఎం ఉద్ధవ్ థాకరేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.అసలే దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తమ రాష్ట్రంలోనే నమోదు అవుతుండటంతో ఆందోళన చెందుతున్న ఉద్ధవ్‌కు తాజా రాజకీయ పరిణామాలు మింగుడు పడట్లేదు.

దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఆ రాష్ట్ర శాసనమండలిలో సభ్యుడిగా నియమించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి తీర్మానించింది.ప్రస్తుతం మహారాష్ట్ర శాసన మండలి నందు గవర్నరు కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి.వాటిలో ఒక ఖాళీ సీట్లలో ఉద్ధవ్ థాకరేను ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ సోమవారం రెండోసారి మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.ఈ క్యాబినెట్ సిఫారసును నిన్న రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి పంపించినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. 

గతంలో ఏప్రిల్ 9వతేదీన ఉద్ధవ్ థాకరేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానించి గవర్నరుకు పంపిన సంగతి తెలిసిందే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఉభయ సభలలో సభ్యులు కాని వారెవరైనా మంత్రి లేదా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తే నాటినుండి ఆరు నెలల లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి.అది సాధ్యపడని సందర్భంలో వారు ఆ పదవికి అనర్హులవుతారు. ఉభయసభలలో సభ్యుడు కానీ ఉద్ధవ్ థాకరే మే 28వతేదీ నాటికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తవుతుంది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఉంటే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై ఉండేవారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు వాయిదా పడ్డాయి.ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కూడా విధాన పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఉండడానికి గవర్నర్ కోటా నుంచి సీఎం ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం శాసనమండలి మొత్తం సభ్యులలో 1/6 వంతు మందిని గవర్నర్ నియమిస్తాడు.

కళలు,సాహిత్యం,సైన్స్,సామాజిక సేవ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన వారిని రాష్ట్ర మంత్రివర్గ సలహా ప్రకారం నియమించడం సంప్రదాయం.అయితే తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విచక్షణాధికారం గవర్నర్‌కి ఉంది.

అయితే రాజ్యాంగబద్ధ పదవి హుందాతనాన్ని కాపాడుతూ కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలి. అలా కాకుండా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా వ్యవహరించి రాజకీయ అస్తిత్వం సృష్టించాలని అనుకొంటే చెడు సంప్రదాయానికి దారితీస్తుంది.తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన వ్యక్తి ఎమ్మెల్సీగా పనికిరాడు ఏమో అని గవర్నరు భావిస్తున్నట్లు అనుకోవాల్సి వస్తుంది.