iDreamPost
android-app
ios-app

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల్లో కీలక మార్పులు

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 10 నుంచి 15 వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. కరోనా కారణంగా పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ హిందీ ఒక పేపర్, ఇతర సబ్జెక్టులు రెండు పేపర్ల చొప్పున మొత్తం 11 పేపర్లు ఉండగా.. వాటిని ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

జూలై 10వ తేదీన ఫస్ట్‌ లాగ్వేంజ్, 11న సెకండ్‌ లాగ్వేజ్, 12న ఇంగ్లీష్, 13న గణితం, 14 సైన్స్, 15వ తేదీన సోషల్‌ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. 100 మార్కులకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుమార్లు పరీక్షలపై ప్రకటన చేసిన విద్యాశాఖ.. లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత ప్రిపేర్‌ అయ్యేందుకు తగిన సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను దాదాపు రెండు నెలల ముందుగానే ప్రకటించారు. భౌతిక దూరం పాటిస్తూ. కోవిడ్‌ నుంచి రక్షణ చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు చేపట్టనుంది.