iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఏదైనా సినిమా హిట్టా కాదా అని చెప్పడానికి కలెక్షన్లతో పాటు అది ఎన్ని రోజులు ఆడింది అనే లెక్కలు కొలమానంగా ఉండేది. ఇప్పుడు పెట్టుబడి మీద లాభాలు వస్తే చాలానే ఉద్దేశంతో ఉన్న నిర్మాతలకు అవేవి పట్టడం లేదు . మొదటి రెండు వారాల్లోనే సినిమా జాతకం ముగిసిపోతోంది . ఆలోగా ఎంత రాబట్టుకుంటే అంత లేదంటే గోవిందా అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మన దగ్గర ఫ్లాపు లేదా డిజాస్టర్ అనిపించుకున్న సినిమాలు హిందీలో డబ్బింగ్ కొట్టి యుట్యూబ్ లో పెడితే చాలు మిలియన్ల వ్యూస్ వరదలా వచ్చి పడుతున్నాయి.
గతంలో జూనియర్ ఎన్టీఆర్, నితిన్, రామ్ ల ఫ్లాప్ సినిమాలు ఆన్ లైన్ లో సంచలనం రేపాయి. ఇప్పుడీ వరసలో విజయ్ డియర్ కామ్రేడ్ వచ్చి పడింది. కేవలం ఒకే ఒక్క రోజులో 16 మిలియన్ల వ్యూస్ సాధించి ఔరా అనిపించింది. ఇలాంటి డబ్బింగులకు ప్రఖ్యాతి గాంచిన గోల్డ్ మైన్స్ ఛానల్ దీన్ని అప్ లోడ్ చేయడం విశేషం. అల్లు అర్జున్ డీజే, సన్ అఫ్ సత్యమూర్తిలు రెండు వందల మిలియన్లకు పైగా రికార్డులు సృష్టించింది ఇందులోనే. ఆ మధ్య నితిన్ లై కూడా షాకింగ్ ఫిగర్స్ నమోదు చేసింది.
అందుకే మన స్టార్ల సినిమాలు విడుదల కాకుండానే హిందీ డబ్బింగ్ హక్కులను ఫలితంతో సంబంధం లేకుండా భారీ రేట్లకు ఎగబడి మరీ కొనుక్కుపోతున్నారు. నార్త్ లో వీటికి ఆదరణ ఉండటానికి కారణం ఒకటే. యుట్యూబ్ లో ఏ సినిమా అయినా ఉచితంగా చూడొచ్చు. అందులోనూ మాస్ మసాలా కంటెంట్ పుష్కలంగా ఉండే తెలుగు తమిళ సినిమాలంటే వాళ్ళు పడి చస్తారు. బాలీవుడ్ లో ఇంత రెగ్యులర్ గా ఇలాంటి మూవీస్ రావు. అందుకే రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా మన ఫ్లాప్ సినిమాలు వాళ్లకు బంగారు గనులుగా మారాయన్నది వాస్తవం.