iDreamPost
iDreamPost
ఏపీలో ‘లేఖ’ రేకెత్తించిన హీట్ అంతా ఇంతా కాదు. చరిత్రను తిరగేస్తే తప్ప ప్రస్తుత తరాలకు పెద్దగా ఇటువంటి సంఘటనలు గుర్తు కూడా లేదు. కానీ లేఖరాసినాయన, అందుకున్నాయన గమ్మున కూర్చున్నారు. కాకపోతే ప్రతిపక్షం హోదా నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ‘ఆఫ్ఘానిస్థాన్ బ్యాండు మేళం’ వాయించేస్తున్నారు. ఈ మేళానికి ముందు నుంచునే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంకో అడుగుకు ముందుకేసేసి జగన్ తరువాత సీయం ఎవరుంటారు? అని వైఎస్సార్‌సీపీలో చర్చించేసుకుంటున్నారంటూ మీడియా ముందుకొచ్చేసారు.
సీయం జగన్ ఢిల్లీ పర్యటన మొదలు పెట్టిన వెంటనే తన మార్కు సన్నాయిమేళంతో మీడియా ముందుకు వచ్చే యనమల ఈ సారి ఈ ఆఫ్ఘానిస్థాన్ మేళానికి మారారు. వైఎస్సార్‌సీపీలో అంతర్గతంగా చర్చించేసుకుంటున్నారంటూ మైకును పట్టుకుని తెగ ఊదేసారు. అయితే ఇదంతా గమనిస్తున్న జనానికి మాత్రం పెద్దపెద్ద డౌట్లు తడతా ఉన్నాయట. రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి న్యాయవ్యస్థలోని వ్యక్తిని గురించి ఏదైనా ఫిర్యాదు చేయొచ్చా? చేయకూడదా?. లేఖ రాయరాదని, ఆరోపణలు చేయకూడదని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఏమైనా రాసి ఉంచారా? గతంలో ఇటువంటివీ ఏమీ జరగలేదా? తదితర ఇత్యాది తరహా ప్రశ్నలు జనం నుంచి విన్పిస్తున్నాయి.
అయితే ఇవేమీ పట్టించుకోకుండా రాయకూడదంతే? రాయకూడదంతే? ఆయ్.. అలా రాసేస్తారేంటి.. అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు పంచెలు, కండువాలు సర్దేసుకోవడం పట్ల జనం అనుమానాలు పెంచేసుకుంటున్నారట. అయితే అప్పుడెప్పుడో పుష్కర కాలం క్రితమే జనానికి దూరమైపోయిన యనమల మాత్రం జనం నాడిని పెద్దగా పట్టించుకోకుండా తాను మైకు ముందు వాయించాలనుకున్న మేళం వాయించేసి ఊరుకున్నారట. ఇప్పుడు అదే ఆక్షేపణలకు పెద్ద ఆసరా అయికూర్చుంది.
అసలే రాష్ట్రంలో ఏం జరిగినా అంతా నేనేనంటూ ఎప్పుడు ముందుండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ లేఖ అంశంపై అంటీముట్టనట్టుగానే స్పందించడం జనాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. ఒక వేళ ఆయన సొంత మీడియా ఎప్పుడూ చెప్పేటట్టు వ్యూహాత్మక మౌనమే అని సరిపెట్టుకున్నప్పటికీ యనమల ఎక్‌స్ట్రామేళం మాత్రం జనానికి ఎంటర్‌టైన్‌మెంట్‌నే కల్గిస్తోంది.
అసలు ఉత్తరం అందుకున్న పెద్దాయన ఇంకా దానిని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, రాసిచ్చిన ఆయన చక్కగా తన పని తాను చూసుకుంటున్నాడు.. ఇంక ఈ ఉల్లిపిరికట్టె కబుర్లుతో సాధించేదేంటో యనమలకే తెలియాలంటున్నారు జనాలు.