iDreamPost
iDreamPost
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకింత బాధను కలిగిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేసేందుకు పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్రలే ఇందుకు నిదర్శనం. శాసనమండలిలో పార్టీల కోసం రాయలసీమ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు ప్రాంతాల అభివృద్ధిలో తీవ్ర ప్రభావం చూపనుంది.
రాయలసీమలో హైకోర్టు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో రాయలసీమ వాసులంతా ఉబ్బితబ్బిబ్బయిపోయారు. అయితే ఇందుకు అన్ని పార్టీల నుంచి మద్దతు ఉంటుందని ఊహించారు. కాగా ఇందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తన విధానాలతో ముందుకు వెళుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇదే సమయంలో రాయలసీమలో హైకోర్టు పెడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకతాటిపై ఉండి హైకోర్టును స్వాగతించాలి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం పార్టీ ప్రయోజనాలు చూసుకుంటూ.. స్థానికంగా ప్రజల మనోభావలకు అనుగుణంగా వ్యవహరించడం లేదు.
రాయలసీమకు హైకోర్టు కావాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. సుమారు ఆరు దశాబ్దాలుగా సీమవాసులు దీనిపై ఎన్నో ఆందోళనలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు పెడతామంటే స్వాగతించాల్సింది పోయి పార్టీల కోసం పాకులాడుతున్నారు. మొన్నశాసనమండలిలో జరిగిన తీరుపై కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీల కోసం పనిచేయాల్సిన సమయం ఇది కాదని.. తమ ప్రాంతం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదా అని రోడ్లమీదకొచ్చి నిలదీస్తున్నారు. రాయలసీమ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను ఒక్క సారి పరిశీలిస్తే ,శివనాథ్‌రెడ్డి, బి.ఎన్ రాజనరసింహులు, బి.టి నాయుడు, కే.యి ప్రభాకర్, గుండుమాల తిప్పేస్వామి, జి. దీపక్ రెడ్డి, గాలి సరస్వతి, మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎన్.ఎం.డి ఫరూక్, శమంతకమణి, గౌనివారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పరిపాలించారు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారం చేపట్టినా ఎవ్వరూ వైసీపీ అధినేత జగన్ స్టయిల్లో ఆలోచించలేదు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండటం వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందేలే విధానాలు ఉంటాయని ఆయన ఆలోచించారు. రాయలసీమ నుంచే ఇంతవరకు ముఖ్యమంత్రులు ఉన్నా.. ఏ ఒక్కరూ సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఆలోచన చెయ్యలేదు. ఇప్పుడు ఎవ్వరూ చేయనివిధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతుంటే ప్రతిపక్ష టిడిపి అడ్డుతగులుతోంది. అయితే పార్టీలు ఎలా ఉన్నా కనీసం వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయానికి పార్టీలకతీతంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ, మండలిలో రాయలసీమ ప్రాంత ప్రతినిధులు వ్యవహరించిన తీరు ఎప్పటికీ సీమ వాసులు మార్చిపోరు. సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తారన్నది నేతలు గుర్తుంచుకోవాలి.