iDreamPost
android-app
ios-app

బడ్జెట్‌ ఆమోదించకుండానే మండలి నిరవధిక వాయిదా.. మంత్రి వెల్లంపల్లిపై టిడిపి దాడి..?

బడ్జెట్‌ ఆమోదించకుండానే మండలి నిరవధిక వాయిదా.. మంత్రి వెల్లంపల్లిపై టిడిపి దాడి..?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన వాగ్వాదంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ద్రవ్య వినిమయ బిల్లు మొదట ప్రవేశపెట్టాలని టీడీపీ, సీఆర్‌డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో రోజంతా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉదయం మొదలైన వాదోపవాదాలు సమయం గడిచే కొద్దీ పెరిగాయి. సభ్యులు ఒకరినొకరు దూషించకోవడం, తోసుకోవడం వరకూ పరిస్థితులు వెళ్లాయి.

సభలో ఇలాంటి పరిస్థితుల మధ్య దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ సభ్యులు బీద రవిచంద్ర, సత్యనారాయణ రాజు దాడి చేసినట్లు ప్రచారం సాగుతోంది. సభలోని పరిస్థితులను ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తన ఫోన్‌లో వీడియో తీస్తున్న విషయంపై వారి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను వారిస్తున్న మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ సభ్యులు దూసుకొచ్చారు.

రోజంతా సాగిన మండలిలో ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండానే సభ నిరవధిక వాయిదా పడింది. గందరగోళం మధ్యనే చైర్మన్‌ షరీఫ సభను నిరవధిక వాయిదా వేశారు. సీఆర్‌డీఏ రద్దు బిల్లు, రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో సహా ఏ ఇతర బిల్లులు ఆమోదం పొందలేదు. వీటితోపాటు ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించకుండానే సభను నిరవధిక వాయిదా వేయడం విశేషం. బహుసా శాసన మండలి చరిత్రలో ఇలా ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందకపోవడం ఇదే మొదటి సారి కావొచ్చు.

బడ్జెట్‌ ఆమోదంతోనే నిధులను ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. లేదంటే గడచిన మూడు నెలలకు తీసుకున్నట్లుగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసి ఖర్చుకు అనుమతి పొందవచ్చు. అయితే ప్రస్తుతం బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడడం జరిగాయి. మండలిలో కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఆమోదం పొందలేదు. అయినా ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్న మాట. ఆర్థిక బిల్లులను ఆపడం, లేదా తిరస్కరించే అధికారం మండలికి లేదని వివరిస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండానే మండలి వాయిదా పడినంత మాత్రాన నిధుల వినియోగానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని పేర్కొంటున్నారు.