iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ అనంతరం అంటే గత మార్చి 24 తర్వాత దేశంలోనే తొలిసారిగా సమావేశమవుతున్న చట్టసభ ఏపీ శాసన సభ కావడం విశేషం. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బడ్జెట్ ఆమోదం అనివార్యంగా మారిన సమయంలో వీలయినంత స్వల్ప సమయంలో సమావేశాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అవకాశం ఉన్న సమయంలో విపక్షం కోరినట్టుగా అదనపు సమయంలో కూడా సభ నిర్వహణకు అంగీకరించిన ప్రభుత్వం ఈసారి అందరి శ్రేయస్స రీత్యా సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ విప్ ఈ మేరకు విపక్షాన్ని విజ్ఞప్తి చేశారు. పెద్దగా చర్చలకు ఆస్కారం లేకుండా చూడాలని కోరారు. ఇక ఆందోళనలు నిరసనలు వద్దని వారించారు.
కానీ విపక్షం దానికి విరుద్ధంగా వ్యవహరించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇప్పటికే రెండు చోట్ల చంద్రబాబు పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. అయినా గానీ ఆయన నాయకత్వంలోని టీడీపీ నేతలు తాజాగా మరోసారి ఆందోళనకు పూనుకున్నారు. అందుకు తోడుగా బీఏసీ సమావేశంలో వితండవాదన కొనసాగించారు. వాస్తవానికి బీఏసీ సమావేశానికి టీడీపీ తరుపున హాజరుకావాల్సిన అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ కావడంతో ఆయన స్థానంలో నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన తో పాటుగా మంత్రి కన్నబాబు, అనిల్ కుమార్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
స్పీకర్ తమ్మినేని కూడా సభ నిర్వహణకు దారితీసిన పరిస్థితులు, తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించిన తర్వాత బిజినెస్ పై జరిన చర్చలో టీడీపీ తరుపున హాజరయిన నిమ్మల భారీ చిట్టా సమావేశం ముందుంచారు. 16 అంశాలను ఎజెండాలో పెట్టాలని టీడీపీ తరుపున పట్టుబట్టారు. అందులో ప్రధానంగా తమ నేతలపై అవినీతి కేసుల కారణంగా అరెస్ట్ చేస్తున్న అంశం మీద చర్చ చేయాలని కోరడం విశేషంగా మారింది. అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ అంటూ దాని మీద చర్చకు ఆస్కారం ఇవ్వాలని ఆయన పట్టుబట్టడంతో అంతా అవాక్కయ్యారు.
సభా సమయం తక్కువగా ఉంది, కరోనా సమస్యతో అందరికీ సమస్య అవుతుందని చెప్పినా ఆయన తన వాదన వినిపించడం విస్మయకరంగా మారింది. చివరకు పాలకపార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు రెండు రోజుల పాటు సభ నిర్వహణకు సంబంధించిన అంశాలపై నిర్ణయం చేశారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ , ఆమోదం, ఆ వెంటనే బడ్జెట్, చర్చ , ఆమోదం కూడా జరపాలని తీర్మానించారు. సభలో 4బిల్లులు, 4 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు. శాసనమండలి బీఏసీ లో కూడా 2 రోజుల పాటు సమావేశాలకు నిర్ణయం తీసుకున్నారు.