Idream media
Idream media
నిన్న బుధవారం సినీ నటుడు, అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్‌గా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ 37వ పుట్టినరోజు. లాక్‌డౌన్ ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జూనియర్ పుట్టిన రోజును కేకులు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కు పుట్టిరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫేస్‌బుక్, ట్వీట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో హోరెత్తించారు.
కానీ తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు మాత్రం జూనియర్ పుట్టిన రోజు తెలియనట్లుగానే వ్యవహరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో వివిధ విభాగాల నేతలకు క్రమం తప్పకుండా, ఎవరిని విస్మరించకుండా తమ ట్విట్టర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్‌లు ఆశీస్సులు అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇలాంటిది జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.
జూనియర్‌ను కావాలనే చంద్రబాబు దూరంగా పెడుతున్నారని చెప్పాల్సిన పని లేదు. 2009 ఎన్నికల తర్వాత నుంచి జూనియర్‌ను పార్టీకి దూరం చేస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఘోర పరాభవంతోపాటు వైఎస్ జగన్ ధాటికి రాబోయే ఎన్నికల్లోనూ గెలుపుపై పార్టీ శ్రేణులు ఆశలు వదిలేసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అమలులో దూకుడు.. చంద్రబాబుతోపాటు ఆ పార్టీ శ్రేణులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, తన బడాయి మాటలతో చంద్రబాబు రాష్ట్ర ప్రజల వద్ద విశ్వసనీయత కోల్పోయారు. పైగా వయస్సు పైబడి ఏమి మాట్లాడుతున్నారో కూడా తమ్ముళ్లకు అర్థం కావడంలేదు. బాబు కాకపోయినా లోకేష్‌పై ఆశలు పెట్టుకుందామా అంటే.. అది పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డట్లుగా ఉంటుందని తమ్ముళ్లకు ఇప్పటికే అర్థం అయింది. పార్టీలో పదవులు, మంత్రి పదవి చేపట్టిన లోకేష్ తెలివితేటలు, సామర్థ్యం ఏమిటో తమ్ముళ్లతోపాటు ప్రజలుకు బాగా అర్థం అయింది.
అందుకే తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ను జూనియర్ ఎన్టీఆర్‌తో ఊహించుకుంటున్నారు. 2024లో కాకపోయినా ఆ తర్వాతైనా జూనియర్ ఎన్టీఆర్‌తోనే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం అని గట్టిగా నమ్ముతున్నారు. జూనియర్ శక్తి, సామర్థ్యాలు ఏమిటో 2009 ఎన్నికల్లోనూ అందరూ చూశారు. తన ప్రచార వాగ్థాటితో త్రిముఖ పోరు జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీకి 92 సీట్లు తెచ్చి పెట్టారు. ఆ దెబ్బతోనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. జూనియర్ వెలుగులో ఉంటే.. తన కుమారుడు భవిష్యత్ చీకటిలో పడుతుందని కావాలనే దూరం పెట్టారంటూ సాగిన ప్రచారంలో వాస్తవం లేకపోలేదు.
ప్రస్తుతం చంద్రబాబు వయస్సు 70 ఏళ్లు. 2024 ఎన్నికల నాటికి 74 వస్తాయి. చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు చమరాంక దశకు చేరుకుందని చెప్పవచ్చు. అందుకే తమ్ముళ్లు ఇప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అయితే అది చంద్రబాబు తిరగగలిగినంత కాలం సాధ్యం కాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. తమ్ముళ్ల ఆశలను కాలం ఏ దిశగా తీసుకెళుతుందో వేచి చూడాలి.