Taathamma Kala : రెండు నెలలు నిషేధానికి గురైన NTR సినిమా – Nostalgia

నందమూరి బాలకృష్ణ మొదటిసారి తెరమీద కనిపించిన సినిమా తాతమ్మ కల. సోలో హీరోగా కౌంట్ చేయలేం కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్న స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర ఓనమాలు దిద్దుకుంది మాత్రం ఈ చిత్రంతోనే. అలా అని ఇది ఆషామాషీ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. అప్పటి ట్రెండ్ కి ఎదురీది ఒక విభిన్న అంశంతో రూపొందింది. ఆ విశేషాలు చూద్దాం. 1974 దేశంలో కుటుంబ నియంత్రణ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇద్దరు పిల్లలు ముద్దు అంతకు మించి వద్దు అంటూ ప్రభుత్వమే స్వయంగా జనాన్ని చైతన్య పరచడం మొదలుపెట్టింది. అప్పటికి గ్రామాల్లో వ్యాసక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే అదో పెద్ద నేరంగా భావించేవాళ్ళు.

అప్పుడు ఎన్టీఆర్ మదిలో మెదిలిన ఆలోచనే తాతమ్మ కల. పరిమిత సంతాన సూత్రానికి ఆయన వ్యతిరేకం. అందుకు సాక్ష్యంగా ఆయన నిజ జీవితంలోని పిల్లలనే చూపించవచ్చు. సంతానం ఎందరు ఉండాలనే దాని మీద తల్లితండ్రులకు తప్ప ఇంకెవరికి హక్కు ఉండదని నమ్ముతారు. ఈ పాయింట్ ని బేస్ చేసుకుని రాసుకున్న కథని రచయిత డివి నరసరాజుకి వినిపించగా ఆయన పదునైన సంభాషణలతో స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. బాల నటుడిగా బాలకృష్ణను పరిచయం చేస్తూ హరికృష్ణను కూడా ఇందులో భాగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఎస్ రాజేశ్వరరావు సంగీతంతో సినిమా మొదలెట్టారు. తాతమ్మ రావమ్మగా భానుమతి రామకృష్ణ గారు జీవించేశారు. అన్నగారు డ్యూయల్ రోల్ చేశారు.

మనవడి పాత్రకు పుట్టిన ఐదుగురు పిల్లలు సామాజికంగా రోజూ చూస్తున్న అయిదు ప్రధాన సమస్యలకు పరిష్కారాలకు ప్రతినిధులుగా ఉంటారు. అందులో వ్యసనపరుడిగా హరికృష్ణ, తాతమ్మ కల నెరవేర్చే మునిమనవడిగా బాలకృష్ణ నటించారు. రాజబాబు, రమణారెడ్డి, కాంచన, రోజారమణి, చలపతిరావు ఇతర తారాగణం. అనుకున్నట్టుగానే దీనికి సెన్సార్ అడ్డంకులు వచ్చాయి. రెండు నెలలు నిషేధం విధించారు. అసెంబ్లీలో సైతం దీని మీద చర్చ జరిగిందని అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ పట్టు తెలిసిందేగా అన్ని అడ్డంకులను దాటుకుని 1974 ఆగస్ట్ 30న తాతమ్మ కల రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మొత్తం 11 పాటలు ఉంటాయి. ఉత్తమ కథగా నందమూరి తారకరామారావుగారికి నంది అవార్డు దక్కింది.

Also Read : Bavagaru Bagunnara ? : అన్నీ కుదిరిన మెగా ఎంటర్ టైనర్ – Nostalgia

Show comments