Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆడిన రిజర్వేషన్ల రాజకీయానికి తెరపడింది. ఈ అంశంపై సుప్రిం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింది. 50 శాతం మించకుండా రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు జరపాలని స్పష్టం చేసింది. 2010లో ఇచ్చిన తీర్పును ఉదహరించిన ధర్మాసనం.. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో రెండు నాల్కల ధోరణి అవలంభించిన టీడీపీకి చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రతిపక్ష టీడీపీ సరికొత్త రాజకీయానికి తెరలేపింది. మార్చి 31వ తేదీ లోపు ఎన్నికలు జరపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. టీడీపీకి చెందిన కర్నూలు జిల్లా నేత, చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా వ్యవహరించిన బిర్రు ప్రతాప్ రెడ్డి రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎస్టీ,ఎస్సీ, బీసీలకు కల్పించిన 59.85 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ 50 శాతం ఉండాలని వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చి ఎన్నికల షెడ్యూల్‌కు ఆదేశాలు జారీ చేయగా.. బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రింను ఆశ్రయించారు. ఎన్నికలపై స్టే విధించిన సుప్రిం కోర్టు ఈ సమస్యను పరిష్కరించాలని తిరిగి హైకోర్టుకే బాధ్యతలు అప్పగించింది. ఈ అంశంపై పలు దఫాలు విచారణ జరిపిన హైకోర్టు 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని తీర్పు వెలువరించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి తగ్గడంతో ఆ మేరకు బీసీలకు 9.85 శాతం రిజర్వేషన్లు నష్టపోయారు.
అయితే మళ్లీ టీడీపీ నేతలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సుప్రింను ఆశ్రయించారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పిటిషన్‌ను దాఖలు చేశారు. మొదట 50 శాతం మించి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలే అడ్డుకోగా.. మళ్లీ 50 శాతానికి మించి ఇవ్వాలంటూ వారే కోర్టులను ఆశ్రయించడం టీడీపీ రెండు నాల్కల ధోరణి బట్టబయలైంది. రామ్మోహన్ నాయుడు పిటిషన్‌పై వాదనలు పూర్తి చేసిన సుప్రిం కోర్టు తాజాగా ఈ రోజు గురువారం తీర్పును వెలువరించింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలు లేదంటూ.. ఆ మేరకు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అర్థంతరంగా వాయిదా పడింది. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. తిరిగి ఈ ప్రక్రియ ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి ప్రారంభించనున్నారు. ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమైనా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా సుప్రిం తాజా తీర్పు బాటలు వేసిందని చెప్పవచ్చు. ఇక రిజర్వేషన్ అంశంపై టీడీపీ కానీ, మరెవరూ కానీ కోర్టులను ఆశ్రయించే అవకాశం లేదు.