iDreamPost
android-app
ios-app

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన న్యూస్ వెబ్ సైట్ కీలక నిర్ణయం

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన న్యూస్ వెబ్ సైట్ కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో విధించిన లాక్ డౌన్ మూలంగా పారిశ్రామిక రంగం స్తంభించింది. వ్యాపార రంగంలో వస్తువుల ఉత్పత్తి, మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.దీనితో మీడియా సంస్థలకు వచ్చే వ్యాపార ప్రకటనలు ఆగిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఇప్పటికే చాలా మీడియా సంస్థలు తమ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్టులను తొలగించాయి.

ఈ విపత్తు కాలంలో పత్రికను నడపటానికి సరైన ఆదాయ వనరులు లేక తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రభూమి నిలిచి పోయిన సంగతి తెలిసిందే. పలు జాతీయ దినపత్రికలను ప్రచురించే ఆస్ట్రేలియాకు చెందిన ‘స్టఫ్‌’ అంతర్జాతీయంగా పేరొందిన మీడియా సంస్థ.అలాగే స్టఫ్‌ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తుంది.తాజాగా ఈ సంస్థ ఆర్థిక నష్టాలలో కూరుకుపోయి దివాలా తీసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టఫ్‌ సంస్థను కేవలం డాలర్‌కే కంపెనీ సీఈవో సినేడ్‌ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది.

ఈ వ్యాపార ఒప్పందం మే నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్‌ స్టాక్‌ మార్కెట్‌కు తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా స్టఫ్‌ మీడియా తరఫున 400 మంది జర్నలిస్టులతో సహా మొత్తం 900 పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.సంస్థకు ప్రకటనల రూపంలో లభించే ఆదాయం పడిపోవడంతో స్టఫ్‌ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో ఈ ఒప్పందం జరుగుతుండడం గమనార్హం.