శ్రీదేవి…..మళ్ళీ రాకు ప్లీజ్…… – Nostalgia

నాకు పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని రోజులు.బ్లాక్ అండ్ వైట్ టీవీలో వీడియో క్యాసెట్ వేసుకుని ఓ బ్లాక్ బస్టర్ సినిమా చూస్తుండగా ఒక డౌట్ వచ్చింది. డాన్స్ అంటే అందరూ చిరంజీవి లాగే చేస్తారనే నమ్మకంలో ఉన్నా అప్పటిదాకా. కానీ స్క్రీన్ మీద జరుగుతోంది వేరు. దాంతో నా పక్కనే ఉన్న అన్నయ్యను అడిగా

“అన్నా, వయసైపోయిన ఆ హీరో స్టెప్స్ వేయడానికి చాలా కష్టపడుతున్నాడు కదా. నీకేం నచ్చిందని అంత ఆబగా గుడ్లప్పగించి చూస్తున్నావ్”

“ఎల్లెస్ మాబాగా చెప్పావ్. ఆ హీరోని ఎవడురా పట్టించుకునేది.నేను చూస్తోంది శ్రీదేవిని. చూసేకొద్ది చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అబ్బబ్బా ఏం అందంరా. ఆమె కాలి చెప్పుగా పుట్టినా చాలు జన్మ ధన్యం”

అతను ఏమంటున్నాడో అర్థం చేసుకునే పెద్ద వయసు అప్పుడు నాకు లేదు కానీ ఆ క్షణం హీరోని వదిలేసి శ్రీదేవిని చూడటం మొదలుపెట్టా.అప్పటికి నాకర్థం కాలేదు నాకు తెలియకుండానే నేను కూడా తన ప్రేమలో పడిపోయానని. ఏదో ఆకర్షణతో తన వెండితెర మాయలో నన్ను కూడా పడేసిందని అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు.

దూరదర్శన్ లో ‘సిరిమల్లె పూవా’ అనే పాట వస్తున్నప్పుడు ఇంటిల్లిపాది ఎక్కడిపనులు అక్కడ ఆపేసి ఉయ్యాల్లో ఊగుతున్న ఓ లేత నాజూకు నవనీత సౌందర్యాన్ని అలా తన్మయత్వంలో మైమరచి చూస్తూ ఉంటే నేను భయంతో వణికిపోయే వాడిని. కారణం పొరపాటున శ్రీదేవి అందులో నుంచి జారి కిందపడితే రాత్రంతా హోమ్ వర్క్ మానేసి ఏడుస్తూ కూర్చోవాలి కదా. అందుకే జాగ్రత్త శ్రీ అని మనసులోనే కోరుకునేవాడిని.

కిక్కిరిసిన థియేటర్లో, గట్టిగా ఎగిరి కూర్చుంటే భళ్ళున విరిగిపోయే కుర్చీల మీద, చుట్టూ వస్తున్న కంపు బీడీలదో లేక స్నానం చేయకుండా వచ్చిన మగరాయుళ్ల బాడీలదో అర్థం కాని ఒక విచిత్రమైన స్థితిలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చూస్తున్నా.

పైన ఫ్యాన్ పేరుకి ఉందే కానీ అది తిరగడం లేదన్న స్పృహ ఒక్కడికీ లేకపోవడం థియేటర్ ఓనర్ చేసుకున్న అదృష్టం. ఎప్పుడెప్పుడు చిరంజీవి, శ్రీదేవిని కలిసి చూస్తామా అనే ఆతృత ఎవరిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆ అపురూప క్షణాలు రానే వచ్చాయి. కేకలు, ఈలలు, గోల మధ్య చిరు ఎంట్రీ పాట. అది పూర్తవ్వగానే దేవకన్య ఇంద్రజగా శ్రీదేవి ఇంట్రో. తన ఒంపులను ఎలా చూపిస్తే ప్రేక్షకుడు పరవశించిపోతాడో బహుశా దర్శకేంద్రుడికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ తెలియదనుకుంటా.

పోత పోసిన బంగారాన్ని అందమైన మేనిలా మార్చి, అప్సరసలు మాది అసలు అందమేనా అని ఈర్ష్య పడేంత ముగ్దమనోహర లావణ్యంతో అలా అలా నడిచి వస్తుంటే తమకంతో చూస్తూ ఉండిపోవటం తప్ప నా శరీరం మొత్తం తన వశీకరణలోకి వెళ్ళిపోయింది అని తెలుసుకునేలోపే సినిమా అయిపోయింది. ఇష్టమైన హీరో, రోజు కల్లోకి వచ్చే హీరోయిన్ ఆ సినిమాని ఎన్ని సార్లు చూసానో లెక్కబెట్టుకుంటే ఆ సమయాన్ని పూర్తిగా చదువుకు కేటాయించి ఉంటే నేను ఇప్పుడున్న జిల్లాకు కలెక్టర్ అయ్యేవాడినని అమ్మ అన్న మాటల్లో అతిశయోక్తి లేదు. ఒక జిల్లాకు మాత్రమే కలెక్టర్ గా ఉండటం కంటే అన్ని జిల్లాలకు తెలిసిన రైటర్ గా మారాలన్న లక్ష్యం అప్పుడే మొలకెత్తిందనుకుంటా.

అలా అలా శ్రీదేవిని చూస్తూ పెరిగిన బాల్యం అప్పుడు అల్లుకున్న అందమైన జ్ఞాపకాల్లో తనూ ఒక భాగం కావడం జీవితంలో మర్చిపోలేనిది. మొదటిసారి శ్రీదేవిలో కోరుకోని మార్పు ఏదో కనిపిస్తోందే అనిపించింది గోవిందా గోవిందా చూసినప్పుడు. ఎస్పీ పరశురాం తో అనుమానం బలపడింది. తనలో ఏదో మిస్ అవుతోంది. ఏదో తేడా కొడుతోంది. అయినా పర్వాలేదు. తను దేవత. అంతే. బుల్లి బుల్లి పెదాలతో అమాయకత్వాన్ని పౌడరులా మొహానికి అద్దుకుని దేవుడా దేవుడా అని ప్రార్ధించడం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

ఖుదా గవా సినిమాను శ్రీదేవి కోసమే చూడాలని నాన్నను వేధించి గంటల చొప్పున వీడియో క్యాసెట్లను అద్దెకు ఇచ్చే షాపుకు లాక్కెళ్లి మరీ అది తెప్పించుకోవడం ఇంకా గుర్తే. ఒక్క ముక్క హిందీ రాకపోయినా కేవలం శ్రీదేవిని చూడాలన్న బలమైన కోరిక చెవులను తాత్కాలికంగా పనిచేయించడం ఆపేలా చేసింది. క్యాసెట్ నేను అద్దెకు తెచ్చుకుంటే శ్రీదేవి నా కళ్ళను లీజుకు తీసుకుంది.

ఇలా రాసుకుంటూ పోతే అంతూ ఉండదు. మనసూ ఆగదు.

ఇదంతా గతం……..వర్తమానానికి వస్తాను…..

మూడేళ్ళ క్రితం ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం లేవగానే నువ్వు ఇక లేవనే వార్త. నమ్మశక్యం అనే మాట డిక్షనరిలో నుంచి తీసేస్తే బాగుండు అని అనిపించిన క్షణం. టీవీ చూస్తూ తాగుతున్న మంచి నీళ్ళు గొంతుకు అడ్డం పడ్డాయి. జీవితంలో తనను ఏనాడూ నేరుగా కలుసుకోకపోయినా ఎవరో కావాల్సిన దగ్గరిమనిషి దూరమవుతున్న ఫీలింగ్. ఇది నిజమా అనే పరీక్ష చేసుకోలేదు. కాకపోతే మరీ ఇంత త్వరగానా అనే ప్రశ్న మాత్రం చాలా సేపు వెంటాడింది.

శ్రీదేవీ నువ్వు మళ్ళీ రాకు….

అయినా నీకు మరణం ఏంటి. ఇంత మంది ఇన్ని రకాలుగా నివాళి అర్పించారంటే అది చాలదా జీవితానికి. బోనీ ఎన్ని వందల జన్మల పుణ్యమో నువ్వు దక్కావ్. కానీ ఎన్ని లక్షల వ్రతాల ఫలితమో నువ్వు ఇంతటి అభిమానం సంపాదించుకున్నావు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పు.

మళ్ళీ పుట్టకు శ్రీదేవి…..

ఒకవేళ అదే కనక జరిగితే నువ్ యుక్త వయసు వచ్చేనాటికి నేను వయసు మళ్లి ఏ పడక మీదనో మందులతో కాలక్షేపం చేస్తూ ఉంటాను. ఆ వయసులో నీ సినిమాకు తీసుకెళ్ళే తీరిక చేతికి వచ్చిన నా పుత్రరత్నానికి ఉండకపోవచ్చు. అందుకే పుట్టకు. పుడితే నీ సినిమా చూస్తూ ఆనందంతో థియేటర్లోనే నా గుండె ఆగిపోతే మా ఆవిడ పెట్టే శాపనార్థాలు నిన్ను తాకకూడదు…….

వెళ్ళు శ్రీదేవి వెళ్ళు….

నీకు మరణం వచ్చిందంటున్న ఈ అమాయకుల ఏడుపులు చూసి నవ్వుకుంటూ వెళ్ళు……

ఓ ముప్పై, నలభై ఏళ్ల తర్వాతైనా పైన నిన్ను మళ్లీ కలుస్తాగా…….అంత వరకు సెలవు……..

ఇట్లు,
ఎప్పటికీ నీ అభిమాని

Show comments