iDreamPost
iDreamPost
ఎదుటివారు ఏ పనిచేసినా అందులో తన ‘చిట్టీ’ని చూసుకుని మైమరిచిపోయే సినిమా పాత్ర మనకు బాగా తెలిసిందే. సరిగ్గా ఇటువంటి వ్యక్తులే బైట కూడా కన్పిస్తుంటారు. సోషల్ మీడియాలోనైతే వీరి హడావిడి మరీ ఎక్కువ. వీళ్ళకు తమ పార్టీ, తమ నాయకులు తప్పితే ఎదుటి వారు ఏ మాత్రం కన్పించరు. వీరి ‘అతి’ ఎంత వరకు ఉంటుందంటే సీయం వైఎస్ జగన్ కరోనా లాక్డౌన్ కారణంగా ప్రకటించిన రూ. 1000 ఆర్ధిక తోడ్పాటుకు కూడా వంకలు పెట్టేటంత.
పక్క రాష్ట్రంలో 1500 ఇచ్చారు, ఇక్కడిస్తున్నదాంట్లో సగం కేంద్రానిదే.. ఇలా వాళ్ళ పెట్టే పోస్టింగ్‌లకు అంతూ పొంతూ ఉండదు. ఈ ‘చిట్టీ’వేషాలతో కొందరు నవ్వుకుంటుంటే, ఇంకొంతరు ఇందే తలనొప్పిరా బాబూ అనుకుంటుంటారు.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే. లాక్డౌన్ నుంచి బైటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది. అందులో వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు 6,700 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది ఒక్క కేంద్రం మాత్రమే ప్రకటిస్తే పెద్దమొత్తమే కాబోలు అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కల్పించడానికి సీయం వైఎస్ జగన్ 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఒక్క రాష్ట్రమే ఇంత నిధిని ఏర్పాటు చేస్తే కేంద్రం కేటాయించిన రూ. 6,700 కోట్లు ఏం మూలకు? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకమానదు.
దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకటి రెండు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా వ్యవసాయాధారితమే. పోనీ ఆయా రాష్ట్రాలు సొంతంగా ధరల స్థిరీకరణ నిధులు ఏమైనా కేటాయించాయా? అంటే అదీలేదాయె. కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులు కొనేందుకు కేటాయించిన నిధులు పంపకం జరిగితే సగటున 230 కోట్ల వరకు ఒక్కో రాష్ట్రానికి వస్తుంది. దీంతో ఏం చేయాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామనే సెలవివ్వాలి. లేదా సోషల్ మీడియాలో హడావిడి చేసే మన ‘చిట్టీ’లు మొదలెట్టాలి.