Idream media
Idream media
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కుమార్‌కు బీజేపీ ఎసరు పెడుతోందా..? బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చువాలని భావిస్తోందా..? అంటే అవుననేలా జరుగుతున్న పరిణామాలు ద్వారా తెలుస్తోంది. ఇటీవల బిహార్‌లో జేడీయూ, బీజేపీ కలసి పోటీ చేశాయి. 243 సీట్లు గల బిహార్‌లో జేడీయూ 43, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చినా.. ముందుగా అనుకున్న ప్రకారం నితీష్‌కుమార్‌కే సీఎం పీఠం దక్కింది. పైకి చెప్పకున్నా.. బీజేపీ నేతలు ఈ పరిణామంపై అసంతృప్తిగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో బిహార్‌లో ఐదేళ్లపాటు నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా..? లేదా..? అనే అనుమానాలు రేగేలా అరుణాచల్ ప్రదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో జేడీయూకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురుని బీజేపీ లాగేసుకుంది. 60 సీట్లు గల అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా తన మిత్రపక్షమైన జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవడం భవిష్యత్‌లో బిహార్‌లో జరగబోయే పరిణామాలకు సూచికగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై జేడీయూ అధినేత నితీష్ మౌనంగా ఉండడం విశేషం.
సాధారణంగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ ఆకర్షించడం, ప్రలోభాలు పెట్టి చేర్చుకోవడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే మిత్ర పక్షాల మధ్యే ఈ ఫిరాయింపులు చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మొదలైన ఈ పర్వం త్వరలో బిహార్‌లోకి కూడా వచ్చే అకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. నితీశ్‌తోపాటు ఆ పార్టీ నేతల్లోనూ ఇదే గుబులు నెలకొంది.
బీజేపీ ప్రలోభాల రాజకీయంతో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలు కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాంటిది బిహార్‌లో అధికారం చేజిక్కించుకోవడం ఆ పార్టీకి పెద్ద కష్టం కాబోదు. పైగా ఇవే చివరి ఎన్నికలని నితీష్ చెప్పడం.. బీజేపీ పనిని మరింత సులువు చేస్తుంది. నితీష్ లేని జేడీయూను ఊహించలేం. దీన్ని కారణంగా చూపి ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ.. జేడీయూను బీజేపీలో విలీనం చేస్తున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు అంతిమంగా బిహార్‌లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.