నేటి నుంచి రెండో విడత రేషన్.. దుకాణానికి వెళ్లేందుకు అది తప్పనిసరి..

ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం, కందిపప్పు రెండో విడత పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు సభ్యునికి 15 కేజీల బియ్యం, కార్డుకు మూడు కేజీల కందిపప్పు చొప్పున మూడు విడతల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత నెల 29వ తేదీన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో సభ్యునికి ఐదు కేజీల బియ్యం, కార్డు కి కేజీ కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. మూడు విడతల్లో భాగంగా తాజాగా రెండో విడత ఈ రోజు ప్రారంభం కానుంది. చివరగా మూడో విడతగా ఈ నెల 30వ తేదీన ఐదు కేజీల బియ్యం మరో కేజీ కందిపప్పు ఇవ్వనున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేసేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రేషన్ దుకాణాల వద్ద ప్రజలు భారీగా గుమి గూడకుండా ఉండేలా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజుకు పరిమిత సంఖ్యలో టోకెన్లు జారీ చేస్తున్న రేషన్ డీలర్లు ఆ టోకెన్ల ఆధారంగా సంబంధిత సమయంలో లబ్ధిదారులు రేషన్ షాప్ కు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక రేషన్ దుకాణం పరిధిలో ఎక్కువ కార్డులు ఉంటే రెండు లేదా మూడు కౌంటర్లు ఏర్పాటు చేసింది. రేషన్ తీసుకునే సమయంలో ప్రజలు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

కాగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని సభ్యునికి 15 కేజీల చొప్పున, కార్డుకు మూడు కేజీలు కందిపప్పు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీంతోపాటు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందించింది. వెయ్యి రూపాయల నగదు ఈనెల 4వ తేదీన గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో మరింత మంది ప్రజలు ప్రభుత్వ సహాయం అందించే లక్ష్యంతో ఉన్న జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న దరఖాస్తుదారులందరికి రేషన్ కార్డ్ వారం రోజుల్లో మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ లో జరిగిన వైఎస్సార్ నవ శకం కార్యక్రమంలో అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో.. గ్రామ, వార్డు సచివలయాలు అర్హులకు రేషన్ కార్డు అందించనున్నాయి.

Show comments