అత్తను తిడుతూ.. దాడి చేసిన కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది సామెత. అంటే వీరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇంట్లో ఉంటేనే మెప్పు పొందుతారు. లేదంటే చిన్న పాటి యుద్ధమే జరుగుతుంది. గతంలో అయితే అత్తదే హవా నడిచేది. అత్త కూర్చొమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి. అలా హుకుం జారీ చేస్తూ.. తన పెత్తనాన్ని సాగించిందీ అత్త. అలా అని గడసరి కోడళ్లు కూడా లేకపోలేరు. అత్త ప్రవర్తన, మాట తీరును బట్టి నడుచుకునే కోడళ్లు ఉన్నట్లే.. కోడలి నడవడికను బట్టి మారిన పొగరు అత్తలు ఉన్నారు. కానీ నేటి తరం కాస్త భిన్నం. ఉద్యోగాల పేరిట కొడుకులు దూర భారంగా ఉండటంతో కాస్తంత అత్త-కోడలి పోరు తగ్గిందీ కానీ.. ఉంటే కొడుక్కి మనశ్శాంతి కరువయ్యేది. ఇళ్లు రణరంగంగా మారేది. అలా అని అత్తల్ని హింసించే కోడళ్లు లేరా అంటే ఎందుకు లేరూ.. ఇదిగో ఈ ఘటన ఓ ఉదాహరణ.

అత్తపై ఇష్టమొచ్చినట్లు దాడి చేసింది ఓ కోడలు.. ముసలావిడ అని కూడా కనికరించకుండా నేల మీద పడేసి.. చితకబాదిన ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటుచేసుకుంది. కోప్రిలోని సిద్ధార్థ్ నగర్‌లోని వారి నివాసంలో సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. వృద్ధురాలైన అత్తగారిపై కోడలు దుర్భాషలాడటం, ఇల్లు వదిలి వెళ్లమని చెప్పడం అందులో కనిపిస్తున్నాయి. కోడలు తిడుతుండటంతో అత్త కూడా ఆమెపై విరుచుకుపడింది. దీంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లు అయ్యి మరింత కోపంతో కోడలు ఊగిపోయి.. సోఫాలో కూర్చొన్న అత్తను కింద పడేసి ఈడ్చేసింది. దీంతో ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో నేలపై కూలబడిపోయింది అత్త. నొప్పులతో మూలుగుతూ కనిపించింది.

వంట గదిలో మరో మనిషి ఉన్నా.. అత్తపై కోడలు దాడి చేస్తుంటే.. చూస్తుందే తప్ప.. రక్షించే ప్రయత్నం చేయలేదు. సెప్టెంబర్ 14న జరిగినట్లు కనిపిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థానేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. బాధితురాలిని కపూర్ బవడిలోని యునైటెడ్ ఇండియా ఇన్స్యురెన్స్ కంపెనీలో పనిచేస్తున్న కోమల్ లలిత్ దయా రమణిగా గుర్తించారు. కాగా, థానే సిటీ పోలీసులు ఈ ఘటనపై స్పందించి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

Show comments