కమలం గూటికి బ్యాడ్మింటన్ “రాకెట్”

  • Published - 07:30 AM, Wed - 29 January 20
కమలం గూటికి బ్యాడ్మింటన్ “రాకెట్”

సైనా నెహ్వాల్..క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. భారతదేశం తరపున బ్యాడ్మింటన్ లో అనేక పథకాలు సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ప్రతిభావంతురాలు.. 2015 లో నంబర్ వన్ ర్యాంకింగ్ మహిళా షట్లరుగా నిలిచిన సైనా నెహ్వాల్ అత్యుత్తమ క్రీడా కారిణిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం 9 వ ర్యాంకులో కొనసాగుతున్న సైనా వివాహం పారుపల్లి కశ్యప్ తో జరిగింది.

గతంలో అనేకసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సైనా నెహ్వాల్ తాజాగా బీజేపీ పార్టీలోకి చేరాలని నిర్ణయించుకుందని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది. అప్పట్లో క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేయడం వల్ల మోడీని కలిసే అవకాశం సైనాకు దక్కింది. గతంలో సైనా ప్రధానిని కలిసినప్పుడు బ్యాడ్మింటన్ బాట్ ని బహుమతిగా ఇవ్వడం విశేషం. ఆ కలయికలో రాజకీయ కోణం లేదు. కానీ ప్రస్తుతం సైనా బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారు అయ్యింది. ఈ వార్త క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారింది.

కాగా ఢిల్లీలో అసెంబీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సైనా బీజేపీలో చేరుతుండటం పట్ల రాజకీయ వర్గాల్లో భిన్న చర్చలు జరుగుతున్నాయి.ఇంకా సైనా నెహ్వాల్ కెరీర్ ముగిసిపోలేదు. గతంతో పోలిస్తే ఆటలో వేగం తగ్గినా తన క్రీడా భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా లేదు. కానీ బీజేపీలో చేరాలని సైనా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తనకి కెరీర్ పరంగా ఉపయోగ పడతారన్న ఆశతోనే సైనా బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతుంది అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ మిగిలిన ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కాకుండా ముందుగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకోవడంలో సైనా అంతరార్థం ఏమిటో అని క్రీడా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సైనాను బీజేపీ ఉపయోగించుకుంటుందనే వాదనా లేకపోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో సైనా నెహ్వాల్ బీజేపీలో చేరనుందని సమాచారం.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. సైనా నెహ్వాల్ కి ఉన్న క్రేజ్ ని ప్రచారానికి ఉపయోగించుకోవాలన్న బీజేపీ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో వేచి చూడాలి

Show comments