Idream media
Idream media
భారత జట్టు మాజీ క్రికెటర్,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ సచిన్ ఈనెల 24న 47వ వడిలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది తన బర్త్ డే జరుపుకోకూడదని క్రికెట్ గాడ్ సచిన్ నిర్ణయించుకున్నాడు.
తన జన్మదిన వేడుకలకు ఇది అనుకూల సమయం కాదని సచిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్‌లో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు,రక్షణ సిబ్బందికి మద్దతుగా నిలవడానికి తన బర్త్ డే జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.
కరోనాపై పోరాటానికి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ పీఎం కేర్,మహారాష్ట్ర సీఎంఆర్ఎఫ్‌కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. దీంతోపాటు పలు సహాయకచర్యలు,కరోనాపై అవగాహన కార్యక్రమాలలో కూడా సచిన్ పాల్గొంటున్నాడు. సచిన్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు పలు రకాల సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే సచిన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన 40 ఫొటోలను ఆయన అభిమాన సంఘం రేపు విడుదల చేయనుంది.
లెజెండ్ బ్యాట్స్‌మెన్ సచిన్ 200 టెస్టులు ఆడి 329 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 15921 పరుగులు,463 వన్డేలలో 18426 పరుగులు సాధించాడు.టెస్టు,వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండు ఫార్మాట్లలో కలిసి వంద సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డులకెక్కాడు.ఇక జట్టు అవసరాలు తీర్చడానికి అడపాదడపా బౌలింగ్ చేసే సచిన్ తన లెగ్‌బ్రేక్ బౌలింగ్‌తో వన్డేలలో 156 వికెట్లు,టెస్టులలో 46 వికెట్లు తీశాడు.మ్యాచ్ కీలక సమయాలలో తన బంతులతో భారత్‌ను గెలిపించిన ఘనత కూడా సచిన్‌కి దక్కింది.