iDreamPost
iDreamPost
ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ ఆర్ఆర్ఆర్ కు అడ్డంకుల సుడిగుండాలు ఆగేలా కనిపించడం లేదు. షూటింగ్ ముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ సాధ్యపడలేదు. దాన్ని మార్చాక చెప్పిన కొత్త తేదీకి కూడా కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. బాలన్స్ పార్ట్ పూర్తి చేయాలంటే విదేశీ నటీనటులతో పాటు గ్రాఫిక్స్ కోసం ఫారిన్ టీమ్స్ అవసరం. కొవిడ్ 19 వల్ల ప్రపంచం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎంత లేదన్నా ఇదంతా పూర్తిగా సద్దుమణగడానికి ఆరు నెలలు పడుతుంది.
ఆలోగా 2021 వచ్చేస్తుంది. అంతేవేగంగా ఆఘమేఘాల మీద ఆర్ఆర్ఆర్ ని పూర్తి చేయడం సాధ్యపడక పోవచ్చు. ఇంకా అలియా భట్ పార్ట్ షూట్ చేయనే లేదు. చరణ్ తారక్ ల సీన్స్ కూడా బాలన్స్ ఉన్నాయి. పాటలు ఎంత వరకు పూర్తయ్యాయో యూనిట్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. కీరవాణి రీ రికార్డింగ్ మొదలుపెట్టారా లేదా అనేదాని గురించి ఎలాంటి సమాచారం లేదు. మోషన్ పోస్టర్, రామ్ చరణ్ ఇంట్రో వీడియో వచ్చేసాయి. మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఏదో సర్ప్రైజ్ ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఇవన్నీ సరే కానీ ఎంత వేగంగా పర్మిషన్లు ఇచ్చినా వచ్చే ఏడాది జనవరి 8కి ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయడం సాధ్యపడదని నిర్మాత డివివి దానయ్య అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి.
దానయ్య నేరుగా చెప్పిన దాఖలాలు లేవు కానీ జరుగుతున్న పరిణామాలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు రజనీకాంత్ కొత్త సినిమా సంక్రాంతికి వస్తుందని సన్ నెట్ వర్క్ ప్రకటించేసింది. అంటే ఆర్ఆర్ఆర్ గురించి క్లారిటీ తీసుకున్నాకే చెప్పి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం దానయ్య లాక్ డౌన్ వల్ల అందుబాటులో లేరు. జూన్ మొదటివారంలో దీని గురించి స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా పరిస్థితి మాత్రం ఆర్ఆర్ఆర్ కు అంత అనుకూలంగా లేదన్నది వాస్తవం. రాజమౌళి సైతం ఇటీవలే ఇచ్చిన కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలలో విడుదల గురించి సూటిగా చెప్పనే లేదు. అభిమానులు షాక్ కు ముందే ప్రిపేర్ అయితే మంచిదేమో