iDreamPost
android-app
ios-app

RRR Promotions : ఆర్ఆర్ఆర్ – ది రియల్ ప్రమోషన్

  • Published Dec 11, 2021 | 5:05 AM Updated Updated Dec 11, 2021 | 5:05 AM
RRR Promotions : ఆర్ఆర్ఆర్ – ది రియల్ ప్రమోషన్

మొన్న తొమ్మిదో తేదీన విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఆన్ లైన్ లో ఎలాంటి ప్రకంపనలు రేపుతోందో చూస్తున్నాం. అన్ని వెర్షన్లు కలిపి ఇప్పటికే యాభై మిలియన్లు దాటేసిన ఈ విజువల్ వండర్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు అందుకుంటుందో ఊహకందడం లేదు. ఓవర్సీస్ లో జనవరి 7 తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టేశారు. ఇక్కడి స్టాండర్డ్ టైం ప్రకారం అర్ధరాత్రి 12 నుంచే షోలు మొదలవుతాయి. అంటే ఇండియాలో జనాలు నిద్రలేచే లోపు యుఎస్ రిపోర్ట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోనుంది. ఇక రాజమౌళి నెల రోజుల పాటు భీభత్సమైన ప్రమోషన్ కు ప్లాన్ చేసి తన దూకుడుని పాన్ ఇండియా లెవెల్ లో చూపిస్తున్నారు.

ట్రైలర్ వచ్చిన కేవలం 48 గంటల్లో అన్ని బాషల మీడియా ప్రెస్ మీట్లు పూర్తి చేయడం విస్మయపరుస్తోంది. ముంబైలో హిందీ, బెంగుళూరులో కన్నడ, చెన్నైలో మలయాళం తమిళం, ఇవాళ హైదరాబాద్ లో తెలుగు ఏకధాటిగా హీరోలు చరణ్ తారక్, హీరోయిన్ అలియా భట్, నిర్మాత దానయ్యలను వెంటేసుకుని జక్కన్న పరుగులు పెట్టడం చూస్తే ఇప్పటి డైరెక్టర్లు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందనిపిస్తుంది. సినిమాను పూర్తి చేయడం కన్నా దాన్ని పబ్లిక్ కు ఇంకా దగ్గరగా ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద రాజమౌళి క్లాసులు తీసుకోవాల్సిందే. లేకపోతే ఆఘమేఘాల మీద ఇలా సమావేశాలు నిర్వహించి టాక్ టు మీడియా పెట్టడం చిన్న విషయం కాదు.

ఈ విషయంలో ఇతర పాన్ ఇండియా సినిమాలన్నీ వెనుకబడిన మాట చేదుగా అనిపించినా వాస్తవం. పుష్ప, శ్యామ్ సింగ రాయ్, రాధే శ్యామ్ లు ఆర్ఆర్ఆర్ హైప్ కు చాలా దూరంలో ఉన్నాయి. ఒక ప్లానింగ్ అంటే ఎలా ఉండాలో రాజమౌళి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి నిశ్చింతగా ఉండొచ్చు. కానీ దాని మీద బజ్ వెంటనే తగ్గకూడదనే ఉద్దేశంతో ఇతర బాషల ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఇలా ప్లాన్ చేసుకోవడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉధృతంగా ఈవెంట్లు చేయబోతున్నారు. అసలు మీడియా మీటింగులకే ఇంత రచ్చ ఉంటే అభిమానులు వచ్చే ప్రీ రిలీజ్ గురించి వేరే చెప్పాలా

Also Read Gamanam : గమనం రిపోర్ట్