RRR : రెండు వైపులా దిగ్బంధనంలో రాజమౌళి టీమ్

ఇంకా విడుదలకు 36 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఇంటా బయటా పోరు ఎక్కువుతోంది. వీలైనంత ఎక్కువ పోటీ లేకుండా ఉంటే పెట్టుబడి సేఫ్ గా వస్తుందనే అభిప్రాయాలు వ్యక్థమవుతున్న తరుణంలో ఎవరూ రేస్ లో నుంచి తప్పుకునే ఉద్దేశంలో లేకపోవడంతో రాజమౌళి టీమ్ టెన్షన్ పీక్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకపక్క మరో పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ సవాల్ విసురుతోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తోంది ఒక్క బాషలోనే అయినా తగ్గేది లేదంటూ పదే పదే నొక్కి వక్కాణిస్తోంది. వీటి మధ్య నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. ఇప్పుడు గోరుచుట్టు మీద మరో రోకలి పోటు వచ్చి పడింది.

తల అజిత్ నటించిన వలిమై కూడా పొంగల్ రేస్ కి రెడీ అవుతోంది. ఈ మేరకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చేశారట. థియేటర్లను బ్లాక్ చేయడం కూడా మొదలైపోయిందని చెన్నై మీడియా రిపోర్ట్. కాకపోతే డేట్ ఎప్పుడనేది చెప్పలేదు. ఒకవేళ జనవరి 10 తర్వాత వస్తే దాదాపు 80 శాతం స్క్రీన్లు వలిమైకు వెళ్లిపోతాయి. బాలన్స్ ఉన్న 20 శాతంలోనే రాధే శ్యామ్ పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్ఆర్ఆర్ కు దక్కేది ఒక్కో మల్టీ ప్లెక్సుకు రెండేసి షోలు మాత్రమే. ఇది తమిళ వెర్షన్ ని దారుణంగా దెబ్బ తీస్తుంది. ట్రిపుల్ ఆర్ కు హిట్ టాక్ వచ్చినా కూడా ఆరవ సోదరుల మాతృ బాషా ప్రేమ తెలిసిందే. వలిమైకే అగ్రపీఠం వేస్తారు.

రాజమౌళికి తన సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ఈ ఇవన్నీ ఇబ్బంది పెట్టే పరిణామాలే. వలిమై ఎఫెక్ట్ కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. కేరళలోనూ ఉంటుంది. కర్ణాటకలో కొంచెం తక్కువ కానీ అక్కడా స్క్రీన్లను పంచుకోవాల్సి ఉంటుంది. అసలే ఓమైక్రాన్ వైరస్ తాలూకు ఆందోళన పరిశ్రమ ఉంటే ఇప్పుడిలా జరగడం ఆర్ఆర్ఆర్ కు అంత మంచిది కాదు. డేట్ మార్చుకునే ఛాన్స్ లేదు. పైగా భయపడ్డారనే కామెంట్స్ వస్తాయి. వలిమైకు తెలుగులో మార్కెట్ దొరకపోయినా పర్లేదు పొంగల్ ను మాత్రం వదలకూడదని నిర్మాత బోనీ కపూర్ డిసైడ్ అయ్యారట. చూడాలి మరి ఏం జరగబోతోందో

Also Read : 

Show comments