రాధాకృష్ణకు ఈ వారం కొత్తకోణంలో కనిపించిన జగన్

మొత్తానికి ఇష్టమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడని ఎల్లోమీడియా అధిపతి రాధాకృష్ణ అంగీకరించాడు. ఈ విషయాన్ని అంగీకరించటానికి మనసు ఎంత బాధపడుతోందో తెలీదు. ఇంతకీ రాధాకృష్ణ అంగీకరించిన జగన్ గొప్పతనం ఏముంది ? తెలుగు ప్రజలపై తమదైన ముద్ర వేసిన వైఎస్సార్, చంద్రబాబునాయుడు, కేసియార్ కన్నా జగన్ చాలా తెలివైన వాడట. ఎన్టీయార్ రాజకీయం తెలియని నిష్కల్మషుడట. ముఖ్యమంత్రులుగా ఒక్కోరిది ఒక్కో స్టైల్ అయితే వీళ్ళందరినీ జగన్ మించిపోయాడని రాధాకృష్ణ అంగీకరించటమే విశేషం.

ప్రతి ఆదివారం అచ్చయ్యే కొత్తపలుకులో జగన్ గొప్పదనం గురించి రాధాకృష్ణ చాలా విషయాలే చెప్పాడు. ఒక్కో సిఎంది ఒక్కో మోడల్ అయితే జగన్ ది మాత్రం గతంలో ఎవరూ అనుసరించని సరికొత్త మోడలట. జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బలమైన ఓటుబ్యాంకును తయారు చేసుకునేట్లే ఉంటోందట. జగనే కాదు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే పథకమైనా, అమలు చేసే పథకమైనా ఓట్ల కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పథకాలు అందరూ ప్రకటిస్తారు, అమలు చేస్తారు. కాకపోతే ప్రకటించిన పథకాలను ఎలా అమలు చేస్తున్నారనే పద్దతిపైనే లబ్దిదారుల రెస్పాన్స్ ఆధారపడుంటుంది.

జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో అత్యధికం పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఇతరులు ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెగ బాధపడిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ సిఎం కూడా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తుంటే ఏ నిర్ణయమూ తీసుకోలేడు. అంతెందుకు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీలు మేధావులతో చర్చించే నిర్ణయం తీసుకున్నాడా ? ఎవరో ఇద్దరుముగ్గురితో మాట్లాడుకుంటారు తర్వాత నిర్ణయాలు ప్రకటిస్తారంతే. జగన్ ఇపుడు చేస్తున్నది కూడా ఇదే.

రాధాకృష్ణ తప్పుగా రాసిందేమిటంటే ఎన్నికల సమయంలో మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చాడని. జగన్ మద్య నిషేధానికి హామీ ఇచ్చాడు కానీ దశలవారీగా అమలు చేస్తానన్నాడు. పైగా షాక్ కొట్టే విధంగా మద్యం ధరలను పెంచుకుంటు పోతానని కూడా బహిరంగసభలోనే చెప్పాడు. అప్పుడు చెప్పినట్లే ఇపుడు చేస్తున్నాడు. పేద ప్రజల సైకాలజీని ఔపోసన పట్టిన జగన్ సోషల్ ఇంజనీరింగ్ ను కూడా కలిపి నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఏడుపొకటి. ఏ రాజకీయనేత అయినా చేయాల్సిందిదే. కాకపోతే చంద్రబాబు పేదలు, బడుగు, బలహీన వర్గాలను మోసం చేశాడు కాబట్టే సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిలై ప్రతిపక్షంలో కూర్చున్నాడు.

చంద్రబాబు సామాజికవర్గంపై జగన్ ఓ పద్దతి ప్రకారం విధ్వేషాన్ని రగిల్చాడన్నది కూడా తప్పే. కమ్మ సామాజికవర్గంపై వ్యతిరేకత అనేకన్నా అధికార ఉండనే అహంకారంతో దేవినేని, చింతమనేని, యరపతినేని, సుజనా లాంటి వాళ్ళు చాలామంది రెచ్చిపోవటంతో ఇతరులకు టీడీపీని ఓడించాలన్న కసిపుట్టిందన్నది నిజం.మరోవైపు కోడెల కుటుంబం ఆకాశమే హద్దుగా గుంటూరు జిల్లాలో చెలరేగిపోయింది. పైగా కాకినాడలో జరిగిన కమ్మవారి వనమహోత్సవంలో రాబోయే 20 ఏళ్ళు కమ్మవాళ్ళే రాజ్యాన్నేలాలని కోడెల చేసిన బహిరంగ వ్యాఖ్యల్లాంటివే పార్టీకి చేటు తెచ్చాయి.వీటన్నిటిని ఖండించి ,పొరపాట్లను ఎత్తిచూపవలసిన ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు నాడు ప్రతిదానికి జగన్నే నిందిస్తూ వార్తలు రాశాయి.

దశాబ్దాలుగా టిడిపినే అంటిపెట్టుకుని ఉన్న బిసిలు మొదటిసారి ఎందుకు దూరమయ్యారు ? బిసి సంఘాలపై చంద్రబాబు ఎంత తలబిరుసుగా వ్యవహరించాడో అందరూ చూసిందే. కాపుల్లో పవన్ పై నమ్మకం లేదు కాబట్టే వాళ్ళు జగన్ కు దగ్గరయ్యారు. టిడిపికి దూరమైన బిసిలు జగన్ పై నమ్మకం పెంచుకున్నారు. ఇలా ఇలాంటి అనేక కారణాలతోనే ఒక్కో సామాజికవర్గం టిడిపికి దూరమైపోయింది. 2014 ఎన్నికల్లో గంప గుత్తగా టిడిపిని బలపరచిన క్షత్రియులు కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్ కే జిందాబాద్ కొట్టారు కదా. ఎందుకు మద్దతిచ్చారంటే చంద్రబాబు మీద నమ్మకం కోల్పోయారు కాబట్టే. కాబట్టి రాధాకృష్ణ చెబుతున్నట్లు సామాజికవర్గాలను జగన్ టిడిపికి దూరం చేయలేదు. చాలా సామాజికవర్గాలు టిడిపికి దూరమయ్యాయంటే చంద్రబాబు స్వయంకృతమనే చెప్పుకోవాలి.

Show comments