iDreamPost
iDreamPost
రేవంత్ రెడ్డి.. మంచి మాటకారి. ప్రస్తుతం తెలంగాణలో ఫైర్ బ్రాండ్. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తారు. కాంగ్రెస్ లో చేరి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పీసీసీ రేసులో ఉన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి తరఫున ప్రచారం గట్టిగానే చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు.. ఈనెల 15న కీలక కామెంట్లు చేశారు.
‘‘17వ తారీఖున పోలింగ్ పూర్తయ్యాక.. మంత్రులు, ఇన్ చార్జ్ లుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఆఖరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నకిరేకల్ పోతారు. కానీ జానారెడ్డి నాగార్జున సాగర్ లోనే ఉంటారు. ఎందుకంటే ఆయన లోకల్’’ అని అన్నారు. నిజానికి ఈ ‘లోకల్’ పాయింట్ కొన్ని రోజుల ముందు లేవనెత్తి ఉంటే ప్రచారం తీరు మరోలా ఉండేది.
లోకల్ నినాదం.. చాలా పవర్ఫుల్..
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిది నాగార్జున సాగర్ నియోజకవర్గం. ఇప్పుడే కాదు.. నాలుగు దశాబ్దాలుగా ఆయన అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్లో ఓడినా అక్కడే ఉంటారు. అయితే ఈ పాయింట్‌ను రేవంత్ రెడ్డి లేటుగా లేవనెత్తారు. ఈ ఒక్క పాయింట్‌తో ప్రచారానికి వెళ్లినా కలిసొచ్చేది. ఎందుకంటే.. లోకల్ నినాదం చాలా పవర్ఫుల్. గతంలో కేసీఆర్ ఇదే నినాదంతో రెండు సార్లు అధికారం దక్కించుకున్నారు. ‘ఢిల్లీ గులాములు కావాలా.. మీతో గల్లీల్లో ఉండే టీఆర్ఎస్ కావాలా’ అంటూ ప్రచారంలో ప్రశ్నించేవారు. టీడీపీ ఆంధ్రా పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని చెప్పేవారు. టీఆర్ఎస్ మాత్రమే లోకల్ అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సక్సెస్ అయ్యారు.
బెంగాల్ ఎన్నికల్లో లోకల్ ఫైట్
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. బయటి పార్టీలను నమ్మకండి, మీ దీదీకి ఓటు వేయండి అంటూ ప్రజలకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్‌ను ఇందుకు అస్త్రంగా మలుచుకుంది. అక్కడ పోటీ చేస్తున్న తమ అభ్యర్థి సువేందు అధికారి లోకల్ అని, మమత బయటి వ్యక్తిని అని రివర్స్ పంచ్ ఇచ్చింది. దీంతో దెబ్బకు మమత రూటు మార్చారు. నందిగ్రామ్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాను ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్లానని, తాను నాన్ లోకల్ ఎలా అవుతానని మమత ప్రశ్నించారు.
తమిళనాడులోనూ అంతే..
తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీలు పేరుకే పార్టీలు. అక్కడ వాటి బలం, బలగం నామమాత్రమే. తమిళనాడు ప్రజలు లోకల్ అంటే పడిచస్తారు. తమ భాషను కూడా అంతే ప్రేమిస్తారు. ఎంత సేపు అక్కడ ద్రవిడ రాజకీయాలు మాత్రమే నడుస్తాయి. బయటి పార్టీలకు అంత సీన్ ఉండదు. ఢిల్లీ పీఠంపై ఉన్న బీజేపీ పరిస్థితి మరీ దారుణం. అధికార అన్నాడీఎంకే కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. కానీ కొందరు అభ్యర్థులు కనీసం కాషాయ కండువా కూడా మెడలో వేసుకోరు. మోడీ కంటే జయలలిత గురించే ఎక్కువ మాట్లాడుతారు. గతంలో ప్రచారంలో కూడా ప్రధాని మోడీ.. ఎంజీఆర్ గురించి, జయలలిత గురించే మాట్లాడారు. అదీ లోకల్ బలం. తమిళ పార్టీలు తప్ప బయటి పార్టీలు అక్కడ మనుగడ సాగించలేవు. ఒకవేళ ఉన్నా.. తోకపార్టీల్లానే ఉంటాయి.
అమెరికాలో ట్రంప్ కూడా..
2016లో జరిగిన అమెరికా ఎన్నికల్లనూ ‘లోకల్’ కార్డును డొనాల్డ్ ట్రంప్ అస్త్రంగా చేసుకున్నారు. తన ప్రచారంలో ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదం అందుకున్నారు. అమెరికన్ల ఉద్యోగాలకు గండి కొట్టే చర్యలను అడ్డుకుంటామని చెప్పారు. ప్రజలు పట్టంకట్టారు. ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యారు.
‘లోకల్’ నినాదానికి ఉన్న పవర్ అలాంటిది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకబడింది. సాగర్ బైపోల్లో గెలిస్తే ఓకే. కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం మంచి చాన్స్ కోల్పోయినట్లే.
Also Read : నాగార్జున సాగర్ : త్రిముఖ పోరు.. ఎవరిది జోరు..!