Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో శాసన సభలో తీర్మానం ఇక లాంఛనమే కానుంది. మంత్రివర్గ తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ప్రారంభమైంది. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పునర్ధురణ జరిగిన మండలి మళ్లీ 13 ఏళ్లకు ఆయన తయనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో రద్దు కావడం చర్చనీయాంశమవుతోంది. అసలు మండలి క్యాన్సిల్‌కు దారితీసిన పరిస్థితులేమిటి..? తక్షణ కారణం ఏమిటి..? అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.
Read Also: మండలికి మంగళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం
మండలి రద్దుకు దాని పనితీరే ప్రధాన కారణంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి శాసన సభకు పూర్తి విరుద్ధంగా మండలి పని చేసిందని మంత్రులు పేర్కొంటున్నారు. శాసన సభ చేస్తున్న బిల్లులపై సలహాలు, సూచనలు అందించాల్సిన మండలి అందుకు భిన్నంగా బిల్లులను తిప్పిపంపడం, ఆమోదించకుండా ఉంచడంతో బిల్లులను రెండో సారి శాసన సభలో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గడచిన ఏడు నెలల్లో శాసన సభ చేసిన 22 బిల్లులు మండలి సకాలంలో ఆమోదించకపోవడంతో మురిగిపోయాయని ఇటీవల శాసన సభలో మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఎస్సీలకు మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు తదితర ముఖ్యమైన బిల్లులకు కూడా మండలి అడ్డుపడింది. మండలిలో ప్రతిపక్ష టీడీపీకి బలం ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. మండలిలో 58 సభ్యులకు గాను టీడీపీకి 34 మంది సభ్యులు, వైఎస్సార్‌సీపీకి 9 మంది, బీజేపీకి ముగ్గురు, పీడీఎఫ్‌కు ఐదుగురు సభ్యులున్నారు. మరో ముగ్గురు స్వతంత్ర సభ్యులు ప్రాతినిధ్యం ఉండగా మరో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మండలిలో ప్రతిపక్షం ఆడిందే ఆట గా మారింది. ప్రజలచే ఎన్నుకున్న సభ అభిప్రాయానికి భిన్నంగా పెద్దల సభ వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
Read Also: అధిష్టానాన్ని కలవరపెడుతున్న టీడీపీ ఎమ్మెల్సీలు, రసవత్తరంగా మండలి రాజకీయం
మండలి ఇలా పని చేస్తున్న సమయంలోనే.. ఇటీవల మూడు రాజధానులు ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు కూడా మండలి అడ్డుపడడం కౌన్సిల్ రద్దుకు తక్షణ కారణంగా నిలిచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల ఏర్పాటుకు భిన్నంగా మండలి వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధం అంటూనే తన విచక్షణాధికారంతో ఆ రెండు బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మండలి ఔన్నత్యాన్ని కాపాడాల్సిన చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ తన పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు మేరకు నడుచుకున్నారన్న విమర్శలతో మండలి రద్దుకు వేగంగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం మంత్రివర్గం మండలి రద్దుకు తీర్మానం ఆమోదించడం, మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్న శాసన సభలో కూడా ఇదే తీరు కొనసాగే పరిస్థితి ఉండడంతో మండలి రద్దు ఇక లంఛనమే కానుంది.
Read Also: అసెంబ్లీ ప్రారంభంలోనే జగన్ ఏం చేశారంటే..
శాసన సభ పంపిన తీర్మానం పార్లమెంట్ ఎంత సమయంలో ఆమోదిస్తుంది..? దానికి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదముద్ర వేస్తారన్న అంశంపై మండలి రద్దుకు పట్టే సమయం ఆధారపడి ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష టీడీపీ మండలి రద్దుకు ఏమైనా వ్యూహాలు రచిస్తుందా..? కేంద్రంతో ఏమైనా చర్చలు జరుపుతుందా..? గతంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు మండలి రద్దును అడ్డుకునేందుకు జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతారా..? వేచి చూడాలి.