Idream media
Idream media
అది ఒక పురుగు… అంటూ కరోనా వైరస్ పై పాట పాడిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ పేరుతో సినిమా తీసి మరో మారు సంచలనానికి తెర తీశాడు. లాక్ డౌన్ లో మూవీ తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మంగళవారం విడుదలైన ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రెండు రోజుల్లోనే.. 2.7 మిలియన్ల వ్యూస్ తో యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ‘బ్రేకింగ్ న్యూస్… తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు…’.తో ప్రారంభమైన ఆ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అత్యధిక మంది ఆదరణ పొందింది. దాదాపు 4 నిమిషాల నిడివిగల ట్రైలర్ లో దగ్గునే హైలెట్ గా చూపించారు. కానీ.. ఆద్యంతం ఆసక్తిగా.. హార్రర్ మూవీ స్టైల్ లో తీర్చిదిద్ది తన మార్కు చూపించాడు వర్మ. దగ్గు.. జలుబు.. గొంతు నొప్పి అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోయే పరిస్థితి ఉంది.. అనేలా ట్రైలర్ కొనసాగింది.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ట్రైలర్ పై స్పందించారు. ‘అణచివేయలేని రామ్ గోపాల్ వర్మ, చాలా మందికి ‘రాము’ .. నాకు ‘సర్కార్ .. లాక్ డౌన్ సమయంలో ఒక కుటుంబం గురించి మొత్తం సినిమా తీశాడు. పేరు: కరోనావైరస్ .. బహుశా వైరస్‌పై నిర్మించిన మొదటి చిత్రం ఇదే..’ అని ట్వీట్ చేశారు. అయితే.. లాక్ డౌన్ వేళలో.. షూటింగ్ లకు అనుమతి లేని సమయంలో ఈ మూవీ ట్రైలర్ రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. ట్విటర్ వేదికగా.. ఇండస్ట్రీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ‘సినిమా పరిశ్రమకు చెందిన మిగతా వారంతా ఇళ్లు తుడవడం, వంట చేయడం, బట్టలు ఉతకడం.. వంటివి చేస్తే.. నేను మాత్రం ఓ సినిమా తెరకెక్కించా’ అంటూ.. కండలు చూపిస్తూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. వివాదాస్పద వ్యక్తిగా వార్తల్లో ఉండే వర్మ.. కరోనా కాలంలోనూ.. తన పంథా కొనసాగించాడు.