బిల్లా రంగా – జరిగే పనేనా

కొన్ని కాంబినేషన్లు వినడానికి బాగుంటాయి కాని అంత ఈజీగా కార్యరూపం దాల్చలేవు. 1982లో చిరంజీవి, మోహన్ బాబులు అప్పుడే హీరోలుగా కుదురుకుంటున్న స్టేజిలో చేసిన సినిమా బిల్లా రంగా. కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్. నిర్మాతకు మంచి లాభాలు కూడా ఇచ్చింది. ఇప్పటికీ చిరు ఫ్యాన్స్ ఫేవరేట్ లిస్టు లో ఇది ఉంటుంది. అయితే తాజాగా రామ్ చరణ్-మంచు మనోజ్ కాంబోలో రీమేక్ రూపంలో దీన్ని తెరకెక్కించే ఛాన్స్ ఉందంటూ ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో బలంగానే చక్కర్లు కొడుతోంది. దానికి తోడు ఇటీవలే మనోజ్ కొత్త సినిమా అహం బ్రహ్మస్మికి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టడంతో దీనికి ఊతమిచ్చింది.

అయితే ఇది మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆలోచన చేసిన బిల్లా రంగాని మల్టీ స్టారర్ అనలేం. చరణ్ మనోజ్ సమానమైన స్టేచర్ ఉన్న హీరోలు కారు. ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. దానికి ముందు ఫ్లాపులతో మార్కెట్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఒకవేళ బిల్లా రంగా చేయాల్సి వస్తే కనక భారం మొత్తం చరణ్ మీదే పడుతుంది. బిజినెస్ కూడా తన పేరుపైనే జరగాలి. మనోజ్ ఉండటం ప్లస్ గానే భావించినా ట్రేడ్ లెక్కల్లో దీన్ని వాళ్ళు ఆర్ఆర్ఆర్ రేంజ్ మూవీగా భావించలేరు.

ఇద్దరి మధ్యా ఎంత ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఉన్నా అది స్క్రీన్ మీద తీసుకొస్తే ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవచ్చు. అసలు పాత క్లాసిక్స్ ముట్టుకోకుండా కొత్త కథలు ట్రై చేయడమే ఉత్తమమైన పని. ఒకదశలో పెదరాయుడు, హలో బ్రదర్, ఖైది, బొబ్బిలి రాజా లాంటివి ఆయా వారసులతో రీమేక్ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సాగాయి కాని అంచనాలు ఏ మాత్రం తలకిందులైనా అంతే సంగతులనే నిజాన్ని గుర్తించి సైలెంట్ అయ్యారు. అందుకే బిల్లా రంగా ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కడం డౌటే. చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ కాకుండా ఇంకే కొత్త సినిమా ఓకే చేయలేదు. అటు మనోజ్ కూడా అహం బ్రహ్మసి అయ్యాక కాని ఇంకో ఆలోచన చేసే స్థితిలో లేడు. కాకపోతే ఇద్దరి మధ్య ఎంత స్నేహముందో ఆ ఓపెనింగ్ లో బయటపడింది కాబట్టి బిల్లా రంగా వార్తలకు రెక్కలు వచ్చాయి అంతే.

Show comments