తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రజినీకాంత్ కొద్దిసేపట్లో నిర్వహించే మీడియా సమావేశంపై తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
గత కొన్ని సంవత్సరాల నుండి రజినీకాంత్ రాజకీయప్రవేశంపై తమిళనాడులో చర్చ జరుగుతుంది. గతంలోనే రజిని రాజకీయ ప్రవేశం చేయనున్నానని తమిళనాడు ప్రజలకు స్పష్టతనిచ్చారు కానీ, పార్టీ పెట్టబోతున్నట్లు మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాగా కొద్దిరోజుల క్రితం అభిమానులతో నిర్వహించిన సమావేశంలో తాను కొందరిని నమ్మి మోసపోయానని రజినీకాంత్ వ్యాఖ్యానించడం కొంత సంచలనానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశంలో రజినీకాంత్ పెట్టబోయే పార్టీ గురించి కీలక ప్రకటన చేయనున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. మీడియా సమావేశంలో పార్టీ పేరుతొ పాటుగా పార్టీ విధివిధానాలను కూడా రజినీకాంత్ వెల్లడించనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
తమిళనాడు ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పటినుండే సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా రజినీకాంత్ కమల్ హాసన్ తో కలిసి పనిచేస్తారా లేక ఒంటరిగా ఎన్నికలకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారా అనేది కాసేపట్లో తేలబోతుంది. కాగా రజినికాంత్ ప్రకటించబోయే పార్టీ పేరు ఏమై ఉంటుందా అని తమిళనాడులోనే కాక దేశ రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. రజినీకాంత్ పార్టీ గురించి అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా రజిని నిర్వహించబోయే మీడియా సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. వీటన్నింటికి సమాధానం మరి కొద్ది గంటల్లో తెలియనుంది.