iDreamPost
android-app
ios-app

కరోనా కోసం అర్జున త్యాగం

  • Published Mar 06, 2020 | 3:53 AM Updated Updated Mar 06, 2020 | 3:53 AM
కరోనా కోసం అర్జున త్యాగం

కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా పరిశ్రమకి కూడా తగిలింది. కరోనాకి భయపడి త్వరలో విడుదలకి సిద్దమయిన భారీ బడ్జెట్ తో రూపొందిన జేమ్స్ బాండ్ చిత్రం “నో టైమ్ టు డై” ఏడు నెలలు వాయిదా పడింది. కానీ కరోనా వల్ల ఏర్పడిన భయాలను లెక్కచేయకుండా ఈరోజు ఏకంగా ఆరు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఏడవ సినిమాగా విడుదలవ్వాల్సిన రాజశేఖర్ అర్జున మాత్రం వారం రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి రానుంది. కరోనా వల్ల తమ సినిమాను 13వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నామని చాలా అద్భుతమైన అవుట్ ఫుట్ తో అర్జున హీరో కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని ఓ పెద్ద ప్రకటనే ఇచ్చారు.

ఇక్కడ జోక్ ఏమిటంటే కరోనాకు అసలు పబ్లిసిటీనే జరగని చిన్న సినిమాలు సైతం భయపడలేదు. కంటెంట్ మీద నమ్మకంతో కనీసం ఆన్ లైన్ యాడ్స్ కూడా ఇవ్వని స్క్రీన్ ప్లే మూవీ కూడా ఇవాళే బరిలో దిగింది. మరి నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో సినిమా కరోనా కారణం చెప్పడం సిల్లీగానే ఉంటుంది. వాస్తవానికి అర్జున ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం పూర్తయ్యింది. ట్రైలర్ లో యాక్టర్స్ ని చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. కోట, పృథ్వితో సహా అందరూ చాలా పాత లుక్ లో కనిపిస్తారు.

వాస్తవానికి నిర్మాత ఆశించిన బిజినెస్ జరగలేదని థియేటర్లు కూడా కోరుకున్న నెంబర్ లో దొరక్కపోవడంతో వాయిదా తప్పలేదని ఫిలిం నగర్ లో ఇంకో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఇంత లేట్ గా వస్తున్న అర్జున మీద జనానికి అంచనాలేమి లేవు. అందులోనూ రాజశేఖర్ మార్కెట్ ఇప్పుడు డౌన్ లో ఉంది. అందుకే చిన్న సినిమాల మధ్య నలిగిపోతుందేమో అనే అనుమానంతోనే తేదీ మారిందనే చర్చను కొట్టి పారేయలేని పరిస్థితి. సరే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫ్యాన్స్ కు తమ హీరోని తెరపై చూసుకోవడానికి ఇంకో ఆప్షన్ దొరికింది కాబట్టి ఆ రకంగా వాళ్ళు సర్దుకుంటారు. మొత్తానికి అర్జునుడి జాతకం ఎలా ఉండబోతోందో వచ్చే వారం తేలిపోతుంది