బ్రహ్మాస్త్ర @ వైజాగ్ – రాజమౌళి బ్రాండ్ ప్రమోషన్

రెండునెలలకు పైగా టైం ఉండగానే బ్రహ్మాస్త్ర టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని వైజాగ్ నుంచి మొదలుపెట్టడం విశేషం. ఇవాళ అక్కడ జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో హీరో రన్వీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీలతో పాటు తెలుగు వెర్షన్ సమర్పకులు రాజమౌళి హాజరు కావడం విశేషం. డేట్ సమస్య వల్ల హీరోయిన్ అలియా భట్ రాలేకపోయింది. అభిమానులతో కిక్కిరిసిపోయిన ఆడిటోరియంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను షేర్ చేసుకోవడంతో పాటు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మంచి జోష్ ఇచ్చారు. మాములుగా హిందీ సినిమాకు ఈ స్థాయి సందడి కనిపించడం అరుదు.

బ్రహ్మాస్త్ర మూడు భాగాల సిరీస్. మొదటిది పార్ట్ 1 లార్డ్ శివ సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లో విడుదల చేయబోతున్నారు. అమితాబ్ బచ్చన్ తో పాటు నాగార్జున ఇందులో కీలక పాత్ర పోషించారు. రన్వీర్ కపూర్, అలియా భట్ నిజ జీవితంలో భార్యభర్తలయ్యాక వాళ్ళు కలిసి నటించి విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే. అందులోనూ ఇంత పెద్ద గ్రాండియర్ కావడం వాళ్లకు మరింత స్పెషల్ కాబోతోంది. ఇప్పుడీ బ్రహ్మస్త్ర వైజాగ్ ఈవెంట్ వెనుక జక్కన్న మాస్టర్ బ్రెయిన్ ఉందని వేరే చెప్పాలా. హైప్ ని పెంచే క్రమంలో ఇండియా వైడ్ సినిమాను ఎలా కామన్ పబ్లిక్ కి రీచ్ చేయాలనే విషయంలో ఆయన్ను మించిన మాస్టర్ ఉంటారా.

ఇదంతా బాగానే ఉంది కానీ సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ కు ఇంకా వంద రోజులుందని దర్శకుడు చెప్పడం అసలు ట్విస్ట్. సరిగ్గా లెక్కేసుకుంటే 72 రోజులుంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో హండ్రెడ్ డేస్ అన్నారో మరి. ఒకవేళ ఏదైనా వాయిదా ఆలోచన ఉందేమో ఇప్పటికైతే అలాంటి అప్డేట్ ఏమి లేదు. సర్వసృష్టిలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పురాణాల్లో చెప్పబడిన బ్రహ్మాస్త్ర చుట్టూ తిరిగే కథను కనివిని ఎరుగని స్థాయిలో తీర్చిదిద్దామని యూనిట్ చాలా నమ్మకంగా చెబుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించి ఇది బాలీవుడ్ కో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Show comments