iDreamPost
iDreamPost
ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు జరగాల్సిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ధర్మశాల పరిసరాల్లో ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో కనీసం టాస్ కూడా వెయ్యకుండానే మ్యాచ్ రద్దు అవటంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక గంటసేపు వర్షం ఆగడంతో మ్యాచ్ ప్రారంభించేందుకు చిత్తడిగా మారిన మైదానాన్ని అనువుగా సిద్ధం చేసేందుకు సిబ్బంది శ్రమించారు. కానీ గంట తర్వాత మళ్లీ మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో దాదాపు నాలుగు గంటలపాటు అంపైర్లు వేచి చూశారు. కానీ ఎంతకీ వర్షం ఆగకపోవడంతో కొద్దిసేపటి క్రితం మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదే వేదికపై 2019 సెప్టెంబరులో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రత్యక్షంగా స్టేడియంలోకి వచ్చి మ్యాచ్‌ని చూసేందుకు ప్రేక్షకులు అనాసక్తిని కనబరుస్తున్నారు.గత కొన్ని రోజులుగా ధర్మశాలలో వర్షాలు పడుతుండటంతో మొదటి నుండి మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనితో ధర్మశాల స్టేడియం సీటింగ్ సామర్థ్యం 22,000 కాగా ఈ రోజు మ్యాచ్ ప్రారంభం దాకా కేవలం 5 వేలకు పైగా టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) వెల్లడించింది.
ఉదయం నుంచి పిచ్‌తో పాటు మైదానాన్ని పూర్తిగా కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు.కానీ కొద్దిగా నీరు ఒలికి అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో వర్షం ఆగిన గంటసేపు కూడా మ్యాచ్‌ని నిర్వహించడం సాధ్యపడలేదు. ఆదివారం నాడు లఖ్‌నవూ మైదానంలో భారత్,సఫారీ జట్ల మధ్య సిరీస్‌లోని రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.