iDreamPost
android-app
ios-app

పార్లమెంటరీ పార్టీ నాయకులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫరెన్స్ , లాక్ డౌన్ పై అభిప్రాయ సేక‌ర‌ణ‌

  • Published Apr 08, 2020 | 9:40 AM Updated Updated Apr 08, 2020 | 9:40 AM
పార్లమెంటరీ పార్టీ నాయకులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫరెన్స్ , లాక్ డౌన్ పై అభిప్రాయ సేక‌ర‌ణ‌

దేశంలో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన‌మంత్రి వివిధ వ‌ర్గాల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ కార‌ణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కేందుకు ఆయ‌న మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురుతో ఆయ‌న స‌మావేశాలు నిర్వ‌హించ‌గా, తాజాగా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాన పార్టీల నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఉభ‌య స‌భ‌ల్లో క‌లిపి క‌నీసంగా ఐదుగురు స‌భ్యులున్న పార్టీల ఫ్లోర్ లీడ‌ర్ల‌ను ఆహ్వానించారు.

దానికి ఏపీ, తెలంగాణా అధికార పార్టీల నుంచి వైసీపీ ఎంపీలు విజ‌య సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వ రావు, కే కేశ‌వ రావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ తో పాటుగా టీడీపీ నేత గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, తృణమూల్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, శివసేన నుంచి సంజయ్ రౌత్, సమాజ్‌వాదీ నుంచి రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి మిశ్రా, లోక్‌జనశక్తి నుంచి చిరాగ్ పాశ్వాన్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, డీఎంకే నుంచి టీఆర్. బాలు వంటి నేత‌లు హాజ‌ర‌య్యారు. లాక్ డౌన్ కొన‌సాగింపు అంద‌రి అభిప్రాయాల‌ను ప్ర‌ధాని సేక‌రించిన‌ట్టు స‌మాచారం

తొలుత మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఈనెల 14తో ఆ గ‌డువు ముగుస్తోంది. దాంతో ఆ త‌ర్వాత కొన‌సాగిస్తారా లేదా అన్న‌ది ఉత్కంఠ‌త క‌లిగిస్తోంది. భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. తెలంగాణా సీఎం బ‌హిరంగంగానే లాక్ డౌన్ కొనసాగించాల‌ని కోరుతున్నారు. కానీ అదే స‌మ‌యంలో కొన‌సాగిస్తే ఎదుర‌య్యే ఆర్థిక స‌మ‌స్య‌ల‌పై ప‌లువురు ముఖ్య‌మంత్రులు మ‌ధ‌న‌ప‌డుతున్నారు . ఈ నేప‌థ్యంలో అంద‌రి అభిప్రాయాలు సేక‌రించిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకునే యోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా తాజా స‌మావేశంలో ప్ర‌దానంగా లాక్ డౌన్ అంశంపైనే చ‌ర్చించ‌డం విశేషం.