Idream media
Idream media
ఆంధ్రప్రదశ్‌లో కరువు అంటే గుర్తొచ్చేది ప్రకాశం జిల్లా. అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ నిత్యం బతుకు పోరాటానికి వలసబాట పట్టే జిల్లా. ఆర్థికంగా వెనుకబడిన ప్రకాశం జిల్లా కరోనాపై పోరులో మాత్రం విజయం సాధించింది. క్రమ శిక్షణ కలిగిన ప్రజలు, అధికారయంత్రాంగం పోరాటం ఫలితంగా ప్రకాశం జిల్లా కరోనా రహిత జిల్లాగా మారబోతోంది.
ఏపీలో మొదటిసారిగా కరోనా పంజా విసిరిన మూడు జిల్లాలో ప్రకాశం ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించకముందే ప్రకాశం జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ పరిధిలోకి చేర్చింది. మార్చిలో దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న 75 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ జిల్లాలుగా ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లా కూడా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి కట్టుదిట్టమైన చర్యలు, ప్రజల క్రమశిక్షణతో అత్యంత వేగంగా కరోనా వైరస్‌పై విజయం సాధించిందని చెప్పవచ్చు.
ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లాలో 63 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో ఇప్పటికే 60 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరో ముగ్గురు చికిత్స తీసుకుంటున్నారు. ప్రారంభం నుంచి బాధితులను గుర్తించడంతోపాటు సెకండ్ కాంటాక్ట్‌లను వెంటనే గుర్తించి చికిత్స అందించడం లేదా క్వారంటైన్ చేయడంతో ప్రకాశం జిల్లా కరోనా ముప్పు నుంచి వేగంగా బయటపడగలిగింది. ఢిల్లీ మర్కజ్ కేసులు మొదటి ప్రకాశం జిల్లాలోనే వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపట్టడంతో వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగారు. కరోనా కట్టడి కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు 18, 781 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ప్రస్తుతం కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిని సైతం అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా వరందరినీ క్వారంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం 934 మంది క్వారంటైన్‌లో ఉన్నారు.